పదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు పక్కాగా నిర్వహించారా? మార్కుల నమోదు ప్రతిభ ఆధారంగా నమోదు చేశారా, లేదా? అనే అంశంపై తనిఖీలకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్) పరిధిలోని పదో తరగతి విద్యార్థుల మార్కుల నమోదును పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో 69 బృందాలను నియమించారు. ఈ టీమ్‌లు మంగళ, బుధవారాల్లో పర కమిటీ నిర్ధారిస్తేనే ఇంటర్నల్ మార్కుల నమోదు పర్యవేక్షణ చేసి నిర్ధారణ చేస్తాయి. ఆ తర్వాతనే ఇంటర్నల్ మార్కులను ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 540 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ, జడ్పీ పాఠశాలలు 229 ఉండగా.. 17 మోడల్ స్కూళ్లు, 27 కేజీబీవీలు, 17 ఎయిడెడ్, 213 అన్ ఎయిడెడ్ (ప్రైవేటు), 37 సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో 2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు 21,519 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరందరికీ ఫార్మెట్ టెస్టులతోపాటు ప్రాజెక్టులు, రికార్డులు సంవత్సరం మొత్తం ఆయా సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించి మార్కులు నమోదు చేసిన విషయం విదితమే. అవి సక్రమంగా ఉన్నాయా.. లేదా? అనే అంశాన్ని కమిటీలు నిర్ధారిస్తాయి.
– రామగిరి, ఏప్రిల్ 18
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 20 వరకు పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్, ప్రాజెక్టుల మార్కుల నమోదును పరిశీలించేందుకు డీఈఓ బి.భిక్షపతి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుండగా.. ఒకరు గెజిటెడ్ హెడ్మాస్టర్, ఒకరు స్కూల్ అసిస్టెంట్ హోదా, మరొకరు లాంగ్వేజీ పండిట్ హోదా కలిగిన వారిని నియమించారు. టీమ్ చైర్మన్ అయిన గెజిటెడ్ హెడ్మాస్టర్లందరికీ సోమవారం సాయంత్రం డీఈఓ చాంబర్లో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కరోనా ప్రభావంతో అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు రెండు ఎఫ్ఏ టెస్టులు మాత్రమే నిర్వహించారు. వీటితోపాటు ప్రాజెక్టులు, ఇతర రికార్డులను పర్యవేక్షిస్తారు. ప్రతి ఎఫ్ఏ టెస్టుకు 5 మార్కుల చొప్పున నాలుగు టెస్టులకు 20 మార్కులు కేటాయిస్తారు. అదే విధంగా ప్రాజెక్టులకు ప్రత్యేక మార్కులు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం నిర్వహించిన రెండు ఎఫ్ఏ టెస్టులకు కలిపి 20మార్కులకు యావరేజ్ చేస్తున్నారు. ఇదేగాక సీసీఈ నిర్వహణకు, ఎస్ఏ టెస్టుకు మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా నమోదు చేయకున్నా, తప్పులున్నా సరిచేసి టీమ్ సభ్యులు నిర్ధారిస్తారు. ఆ తర్వాత జిల్లా పరీక్షల విభాగం ఆమోదంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మార్కులను ఎస్ఎస్సీ బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల నాణ్యత ప్రమాణాలను బట్టి కచ్చితంగా నిబంధనల మేరకు మార్కులను ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం బైకి బై మార్కులు వేస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని గత సంవత్సరం టీమ్స్ పర్యవేక్షణలో వెల్లడైంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సక్రమంగా ప్రాక్టీస్ చేయకపోయినా, మార్కులు నమోదు చేయడంపై గతంలోనే అధికారులు పలు పాఠశాలలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పర్యాయం ఎంత వరకు వాస్తవాలు నమోదు చేస్తారనేది తనిఖీల అనంతరం బహిర్గతం కానున్నది. ఇదే విషయంలో రాష్ట్ర విద్యాశాఖ సైతం సీరియస్‌గా ఉండటంతో మార్కుల నమోదు తనిఖీ పటిష్టంగా నిర్వహిస్తారని తెలుస్తుంది.
సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పదో తరగతి ఇంటర్నల్ మార్కుల నమోదు ప్రక్రియపై ఈ నెల 11నుంచి 13వరకు కమిటీలు తనిఖీ చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో డీఈఓ నర్సింహ ఆధ్వర్యంలో 266 పాఠశాలల్లో 28 కమిటీలతో తనిఖీలు పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలో డీఈఓ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో 263 పాఠశాలల్లో 29 కమిటీలతో తనిఖీలు నిర్వహించారు. వీటిపై ఆయా కమిటీలు నివేదికలు తయారు చేస్తున్నాయి. ఆ ప్రక్రియ పూర్తికాగానే తనిఖీ చేసిన పాఠశాలల యాజమాన్యాలు వారి పాఠశాలల పదో తరగతి విద్యార్థుల మార్కులను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
టెన్త్ విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో నిర్వహించిన అసెస్మెంట్, ప్రాజెక్టుల అంశాల్లో మార్కులు కచ్చితంగా నమోదు చేశారా.. లేదా? అనే అంశంపై నిర్ధారించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలతో ప్రత్యేక టీమ్స్ వేశాం. ఈ నెల 11 నుంచి 13వరకు జిల్లా వ్యాప్తంగా 26 బృందాలు వారికి కేటాయించిన మండలాల్లోని ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశాయి. అన్ని రిపోర్ట్సు, ఇతర వివరాలను పరిశీలించి సక్రమంగా ఉన్నాయా.. లేవా? అనేది చూస్తాం. విద్యార్థుల నైపుణ్యాల మేరకు మార్కుల నమోదు ఉంటేనే కమిటీలు ఫార్వర్డ్ చేస్తాయి. లేకుంటే వారికి ఏ స్థాయిలో మార్కులు ఉండాలో సూచించి నివేదికలను జిల్లా విద్యాశాఖకు అందజేస్తాయి. ఆ తర్వాత కమిటీ నిర్ధారించిన మార్కులనే పాఠశాలలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆయా పాఠశాలలపై చర్యలు ఉంటాయి.
– కె.నర్సింహ, యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ