నేరేడుచర్ల, ఏప్రిల్ 17 : ‘అరచేతిలో విరిసిన చంద్రవంకను చూసి మురిసిపోనివారెవరు..! వేలి కొసలపై మెరిసిన తారలను చూసి మైమరిచిపోని వారెవరు..! గుప్పిట నిండా సింధూరవర్ణాన్ని దాచుకున్నట్లు.. పిడికిలి విప్పినప్పడల్లా పౌర్ణమి కాంతి జాలువారినట్లు ఆరచేతిలో మోహెందీని చూడ వేయికళ్లూ చాలవు’ అని మెహెందీ(గోరింటాకు) గొప్పదనాన్ని చాటాడో కవి. ఇది అక్షరాలా నిజం, పండుగ సందర్భాల్లో, శుభకార్యాల్లో అతివలు మెహెందీపై మనసు పారేసుకుంటారు. చేతులకు, కాళ్లకు మెహెందీ డిజైన్లతో అలంకరించుకుంటారు. గతంలో పొలాలు, అటవీ ప్రాంతాలు తిరిగి గోరింటాకు చెట్ల ద్వారా ఆకును సేకరించి ఇళ్లలో ఆకులు నూరి అరచేతులకు, కాళ్లకు గోరింటాకు డిజైన్లు పెట్టుకునేవారు. ప్రస్తుతం ఆ బాధ లేదు. మార్కెట్లో రెడీగా మెహెందీ పౌడర్, కోన్లు లభిస్తున్నాయి.
ఆధునిక యువతులు కోన్ డిజైన్ వేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సన్నటి తీగల్లాంటి డిజైన్లు కోన్ ద్వారానే సాధ్యమవుతాయి. అరచేతులు, ముంజేతులు, కాళ్లు, పాదాలపైనా మెహెందీ డిజైన్లు వేసుకుంటారు. ఈడిజెన్ల కోసం యువత గంటల పాటు సమయం వెచ్చిస్తారు.
చూడచక్కటి మెహెందీ డిజైన్లు వేసుకోవడానికి మార్కెట్లో రకరకాల డిజైన్ల పుస్తకాలు లభిస్తున్నా యి. మెహెందీ పెట్టుకునేందుకు ఆసక్తి చూపేవారికి పట్టణ ప్రాంతాల్లోనే కాదు ప్రస్తుతం ఓ మోస్తారు గ్రామాల్లో కూడా బ్యూటీపార్లర్లు అందుబాటులో ఉన్నాయి. మరిం త మంచి డిజైన్లు కావాలనుకునేవారు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
మెహెందీ మొత్తం రసాయనాల కలబోత కావడంతో పెట్టుకునే సమయంలో, పెట్టుకున్న తర్వాత భోజనం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యం. కాలం చెల్లిన పౌడర్లు, కోన్లు వాడినప్పుడు అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. చౌకగా లభించే కోన్లు అంత మంచివి కావు. మెహెందీ కళ్లలో పడకుండా జాగ్రత్త పడాలి. మెహెందీ ఎండిన తర్వాత సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.