కూలీల కొరతకు చెక్, రైతులకు ఆసరా సకాలంలో, వేగంగా పూర్తవుతున్న పనులు తక్కువ ఖర్చుతో చకచకా సాగుతున్న వైనం వ్యవసాయంలో పెరుగుతున్న యాంత్రీకరణ రైతులకు ఎంతో ఊతమిస్తున్నది. కూలీల కొరతను తీర్చడం మొదలుకొని సకాలంలో పనులు పూర్తయ్యేలా యంత్రాలు ఎంతో ఉపకరిస్తున్నాయి. వరిలో నాట్లు వేయడం మొదలుకొని, పంట కోసి గడ్డి కట్టలు కట్టే వరకూ కూలీల అవసరం లేకుండానే చకచకా పనులు జరిగిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న యాంత్రీకరణ ఫలితంగా వేగంగా పనులు పూర్తవుతున్నాయి. పంట దిగుబడిలోనూ మార్పు కనిపిస్తున్నదని రైతులు చెప్తున్నారు.
వ్యవసాయంలో కూలీల అవసరం ఎంతో ఉంటుంది. యంత్రాలు అందుబాటులో లేని సమయంలో ఏ రకం పంటలైనా సరే కూలీలను మాట్లాడుకునేవారు. కాల క్రమంలో కూలీల కొరత, పెరిగిన కూలి కారణంగా రైతులు యంత్రాల దిశగా మొగ్గుచూపుతున్నారు. ప్రతి పనికీ వీలైనంతగా యంత్రాలు లేదా ట్రాక్టర్ల ద్వారా పనులు చేయిస్తున్నారు. దుక్కులు దున్నడం మొదలు కొని పంటలు సాగు చేయడం, పంటను ఇంటికి చేర్చడం, తిరిగి మార్కెట్ యార్డుకు తరలించడంలో యంత్రాలు ఎంతో ఉపకరిస్తున్నాయి.
మిర్యాలగూడ నియోజకవర్గంలో 80శాతం సాగు భూమి నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉంటుంది. ఎక్కువమంది రైతులు వరిసాగు చేస్తున్నారు. వేములపల్లి , మాడ్గులపల్లి, అడవిదేవులపల్లి, దామరచర్ల మండలాల్లోని మెట్ట భూముల్లో వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి అధికంగా సాగు చేస్తారు. ఆయా పంటల్లో కూలీలనే ఎక్కువగా వినియోగిస్తుండగా ఆయకట్టులో యంత్రాలతో వరిసాగు చేస్తున్నారు. నాటు పెట్టే సమయంలో డ్రమ్ సీడర్
మొదలుకొని కలుపు తీత, వరి కోత, గడ్డి కట్టలు కట్టేందుకు యంత్రాలను వినియోగిస్తున్నారు.
యాంత్రీకణ వల్ల ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. కూలీల కొరత అధిగమించడంతోపాటు పనులు సులభంగా, త్వరిత గతిన పూర్తవుతాయి. గతంలో నాటు వేయడం, కోత కోయడం, గడ్డి కట్టల కోసం కూలీను ఆశ్రయించేవారు. సకాలంలో కూలీలు దొరక్క ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయేవారు. కానీ, నేడు 20రోజుల్లోనే ఆయకట్టులో వ్యవసాయ పనులు పూర్తవుతున్నాయి.
వ్యవసాయ పనుల్లో యంత్రాలను వాడటం వల్ల పనులు వేగంగా పూర్తవుతున్నాయి. రోజూ చేనుకు వెళ్లే అవసరం ఉండడం లేదు. గ్రామాల్లో కూలీల కొరత అధిగమించడానికి యంత్రాలే ఏకైక పరిష్కారంగా కనిపిస్తున్నది. పత్తి కర్రను తొలగించడం మొదలుకుని , దుక్కులు దున్నడం , చదును చేయడంవంటి పనుల్లో యంత్రాలను ఉపయోగిస్తున్నాం. – చలికంటి యాదగిరి, రైతు జప్తివీప్పగూడెం
అధిగమించడంతో పాటు సరైన సమయానికి పనులు పూర్తి చేయడంలో యంత్రాలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. వానకాలం సాగుకు భూమిని సిద్ధం చేసుకోవడానికి యంత్రాలనే ఉపయోగిస్తున్నాం. దుక్కి దున్నడం, ఎరువులను తరలించడం, వరి చీడ పీడలను తొలగించడానికి ట్రాక్టర్ సాయంతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నాం.
యంత్రాల ద్వారా పనులు చేయించడం వల్ల ఖర్చులు కూడా కలిసొస్తున్నాయి. కూలీలకు ఇచ్చేదాంతో పోలిస్తే కొంచెం ఎక్కువే అయినా సకాలంలో పనులు పూర్తి కావడంతో పాటు సమయం కూడా కలిసొస్తుంది. పంట వేసినప్పటి నుంచి చేతికందే వరకు రైతులకు శ్రమ తగ్గుతుంది.