సాగు ‘బడి’కూడా సాగుతున్నది. పాఠ్యాంశాలతో పాటు పంటల సాగుపైనా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా అవంతీపురం ఎస్టీ గురుకుల పాఠశాలను ఎర్త్ స్కూల్‌గా ఎంపిక చేయగా, ఉపాధ్యాయులు విద్యార్థులకు వ్యవసాయంలోనూ శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలకు ప్రత్యేకించి రూ.5లక్షలు కేటాయించడంతో పలు రకాల పంటలు పండిస్తున్నారు.
మిర్యాలగూడ మండలం అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ప్రభుత్వం 2020 విద్యా సంవత్సరంలో
ఎర్త్ స్కూల్‌గా ప్రకటించింది. పాఠశాలకు 43 ఎకరాల భూమి, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మేజర్ నీరు అందుబాటులో ఉండడంతో ఎర్త్ స్కూల్‌గా ఎంపిక చేసింది. పంటల సాగుకు భూమిని చదును చేసేందుకు, నీటి వసతి కోసం రూ.5లక్షలు కేటాయించింది. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న పాఠశాల ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించి విద్యార్థులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
పాఠశాల ఆవరణ 43 ఎకరాలు ఉండగా.. అందులో ఐదెకరాలను చదును చేసి పంటల సాగుకు అనుకూలంగా మార్చారు. సుమారు రెండెకరాల్లో వరి పండిస్తుండగా, మరో రెండు ఎకరాల్లో బత్తాయి సాగు చేశారు. మిగిలిన ఎకరం భూమిలో ఆరు తడి పంటలైన పొద్దుతిరుగుడు, కంది, మినుముతోపాటు ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు.
విద్యా బోధనలో భాగంగా వ్యవసాయానికి ప్రత్యేక పీరియడ్ కేటాయించి విద్యార్థులకు వివిధ రకాల పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. పంటలకు భూమి ఎలా తయారు చేయాలన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. వరి సాగు ఎలా చేస్తారు? నారు పోసిన కాన్నుంచి దుక్కి దున్నడం, వరాలు తీయడం, నాట్లు వేసే విధానం, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులను వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి ప్రయోగాత్మకంగా వివరించడంతోపాటు ఆరుతడి పంటల్లో కలుపు తీయడం వంటి పనులు చేయిస్తున్నారు. విద్యార్థులు కూడా ఆసక్తిగా పంటలను పరిశీలించి పనులు చేస్తూ సాగులో మెళకువలు
నేర్చుకుంటున్నారు.
అవంతీపురం గురుకుల పాఠశాలలో 570 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు ప్రతి ఏటా ఎస్ఎస్సీ ఫలితాల్లో వంద శాతం ఫలితాలు సాధిస్తున్నారు. అంతేగాకుండా ఎర్త్ స్కూల్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు పంటల సాగు గురించి తెలుసుకొని స్వయంగా అనుభవం గడించి సాగులోనూ సక్సెక్ అవుతున్నారు.
2021లో వరి, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసి మంచి దిగుబడి సాధించారు. ఆయా పంటల ఉత్పత్తులను మార్కెట్లో అమ్మగా రూ.80వేలు ఆదాయం వచ్చింది. ఆ డబ్బును పాఠశాల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అదేవిధంగా ఎరువులు, రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలు, ఆకుకూరలు విద్యార్థులకు అందుతున్నాయి. ఈ ఏడాది వరి, మినుము, కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగు చేశారు.
నిత్య జీవితంలో ఉపయోగపడే పంటల సాగుపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి స్వయంగా పొలం పనులు చేయిస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు నేర్చుకుంటున్నామన్న సంతోషం కలుగుతుంది. భూమిని చదును చేసి విత్తనాలు నాటి, నీళ్లు పెట్టి, మొక్కలు మొలకెత్తి పైరు పెరుగుతుంటే సంతోషంగా ఉంది. మేము పండించిన ఆకు కూరలు మాకు ఆహారంగా ఇస్తుండడంతో సంతృప్తి కలుగుతుంది. ఎరువులు, పురుగు మందులు వాడని నాణ్యతతో కూడిన ఆకుకూరలు లభిస్తున్నాయి.
– అనిల్ కుమార్, 10వ తరగతి విద్యార్థి
పంటల సాగుపై ప్రయోగాత్మకంగా వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి వివరిస్తున్నాం. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా వింటూ గమనిస్తున్నారు. విద్యార్థులకు కలుపు మొక్కల గుర్తింపు, ఏ పంటకు ఎంత నీరు, ఎప్పుడు పెట్టాలో చెప్తున్నాం. విత్తనం నాటినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు చేపట్టే పనులపై అవగాహన కల్పిస్తున్నాం. ఎర్త్ స్కూల్లో కల్తీ లేకుండా నాణ్యమైన పంట చేతికొస్తుంది. కూరగాయలు, ఆకుకూరలు ఎంతో రుచికరంగా ఉంటున్నాయని విద్యార్థులు చెప్తున్నారు.
– కె.నాగయ్య, సైన్స్ టీచర్, ఎస్టీ బాలుర గురుకుల పాఠశాల, అవంతీపురం
గురుకుల పాఠశాలను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఎర్త్ స్కూల్‌గా నిర్ణయించింది. ఇందులో చదివే విద్యార్థులకు విద్యతోపాటు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి వివరించడంతో సాగుపై అనుభవం వస్తుంది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పంటలు పండించడంతో తమ వంతు కృషి చేస్తున్నారు. చదువులో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ.. సాగుపై పూర్తి అవగాహన పొందుతున్నారు. మున్ముందు సాగు విస్తరణను పెంచి మంచి ఫలితాలు రాబడుతాం.
– కె.సుధాకర్, అవంతీపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్