యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి నూతనాలయం ఈ నెల 25న పునఃప్రారంభం కానున్నది. శ్రీరాంపురం(తొగుట) ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఈ నెల 20న ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణంతో మహాకుంభాభిషేక మహోత్సవం చేపట్టనున్నారు. 25న పరివార రామలింగేశ్వర స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలతో నూతన శివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో ఆలయ అధికారులు, శివాలయ పురోహితులు, అర్చకులు నిమగ్నమయ్యారు. ఆరు రోజుల పాటు నిర్వహించే హోమాలు, పరివార దేవతలకు అధివాస కార్యక్రమాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, హవనాలు, శోభాయాత్ర, సంప్రోక్షణ పర్వాలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మూల మంత్ర జపాలు కొనసాగుతున్నాయి.
శివాలయంలో స్పటికలింగంతో పాటు పరివార దేవతలకు అధివాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గణపతి, కుమారస్వామి, అమ్మవారు, సీతారామలక్ష్మణులు, సూర్య భగవానుడు, మధ్యలో స్పటిక లింగాలకు ఆధివాస కార్యక్రమాలు చేపట్టనున్నారు. 21న సాయంత్రం జలాధివాసం, 23న ధాన్యాధివాసం, 24న శయ్యాధివాసం, పుష్పాధివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివాలయంలోని నవగ్రహ మండపం పక్కనే నిర్మించిన ప్రత్యేకమైన తొట్టిలో పరివార దేవతా శిలామూర్తులకు ఒక్కోరోజు ఒక్కో అధివాస కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు.
యాదాద్రి అనుబంధ ఆలయమైన నూతన శివాలయ పునఃప్రారంభ మహోత్సవాలను స్మార్తగమ సంప్రదాయరీతిలో చేపట్టనున్నారు. పరమహంస పరివ్రాజకచార్యులైన శ్రీరాంపురం(తొగుట) పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతి స్వామి వారి సూచనల మేరకు శివాలయంలో సుమారు 16.50 లక్షల మూలమంత్ర జపాలను వేద పండితులు, శివాలయ అర్చకులు, పురోహితులు పఠిస్తున్నారు. మార్చి 3న జపాలను ప్రారంభించినట్లు ఆలయ అర్చకులు, పురోహితులు తెలిపారు. శివ పంచాక్షరీ జపాలు, నవగ్రహ, గణపతి, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, రాహుకేతువు జపాలను పఠిస్తున్నట్లు వారు వివరించారు.
యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరాలయంలో ధ్వజ స్తంభం, కర్రలు, ఇత్తడి కలశాలు, తొడుగులకు గతేడాది సెప్టెంబర్ 18న శుద్ధి పూజలు చేపట్టారు. ప్రధానాలయానికి ఎదురుగా ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. వీటితోపాటు ఇత్తడి కలశాల స్థాపన, తొడుగులు బిగించి మహాకుంభాభిషేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
శివాలయ మహాకుంభాభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపడుతున్నారు. ముఖ మండపంలోని నవగ్రహ మండపం వద్ద పరివార దేవతా శిలామూర్తులకు చేపట్టాల్సిన ఆధివాస కార్యక్రమాల నిర్వహణకు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకమైన తొట్టిని నిర్మిస్తున్నారు. దీంతో పాటు స్పటిక లింగం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పనులు సాగుతున్నాయి. ముఖ మండపంలో శివలింగ పీఠాన్ని అధిష్ఠించారు. ఆలయం వెలుపలి వీధుల్లో రథశాలకు ఎదురుగా యాగశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 5 యజ్ఞకుండాలను ఏర్పాటు చేయనున్నారు. యాగశాల ప్రవేశం, హోమకుండ సంస్కారం, యాగశాల ద్వారాతోరణ పూజ, దీక్షా హోమం, వ్యాహృతి హోమాలు, ప్రతిష్టాంగహోమాలు, అఘోర మంత్ర హోమం వంటి హోమాదులు నిర్వహించనున్నారు.
ప్రధానాలయాన్ని పునర్నిర్మించే క్రమంలో శివాలయాన్ని కూడా విశాలంగా విస్తరించారు. గతంలో 500 గజాల్లో మాత్రమే శివాలయం ఉండేది. ఇప్పుడు ఎకరం స్థలంలో నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి మండపం, మరకత మండపం, బయట రామాలయం, ఆలయం చుట్టూ ప్రాకారాలతో పనులు పూర్తయ్యాయి. లోపలి రాతి ముఖ మండపం ఆంజనేయస్వామి, గణపతి, పర్వతవర్ధినీ అమ్మవారి దేవాలయాలు, యాగశాల పనులు పూర్తయ్యాయి. అదే విధంగా ప్రాకారంలోని సాలహారంలో విగ్రహాల అమరిక, అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహాలు పూర్తయ్యాయి. శివాలయం ముఖ మండపం ఎదురుగా ధ్వజ స్తంభానికి వెనుక వైపున ఉన్నటువంటి ఆవరణలో ప్రత్యేక పీఠంపై నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానాలయం ముఖమండపం చుట్టూ ఉన్న ఫిలర్ల మధ్యలో ఇత్తడి గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆలయం లోపలి భాగంలో, బయట ఉత్తర భాగంలో ఫ్లోరింగ్ పనులు ముగిశాయి. బయట వీధుల్లో కల్యాణ మండపం పూర్తికాగా, రథశాలకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పైబర్ తొడుగులను అమర్చారు. శివాలయం ప్రహరీ ప్రాంతంలో ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా ప్రత్యేకంగా తయారు చేసిన ఇత్తడి విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ఆలయ ఆర్చీకి శివపార్వతుల విగ్రహాల బిగింపు ప్రక్రియ పూర్తయ్యింది.