
సూక్ష్మ నుంచి స్థూల వ్యాపార స్థాయికి ఎదుగాలి
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి
చరణ్‌జిత్ సింగ్ చిట్యాలలో మహిళా సంఘాలతో సమావేశం
మహిళా సంఘాలు తాము తయారు చేసే ఉత్పత్తుల్లో నాణ్యత పెంచి, సాంకేతిక సహకారం తీసుకుంటూ ఈ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని, తద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి చరణ్‌జిత్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ అన్నారు. ఆదివారం చిట్యాలలో స్వయం
సహాయక మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు
మాట్లాడారు. మహిళా సంఘాల రుణ పరిమితిని ప్రభుత్వం రూ.10 నుంచి 20 లక్షలకు పెంచిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చిట్యాల, ఆగస్టు 29 : మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల నాణ్యత పెంచి, సాంకేతిక సహకారం తీసుకుంటూ ఈ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టడం ద్వారా సూక్ష్మస్థాయి నుంచి స్థూల వ్యాపార స్థాయికి ఎదగాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి చరణ్‌జిత్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాలలోని సామ లక్ష్మీపాపిరెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక గ్రూపుల ప్రత్యేక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి కోసం బడ్జెట్‌ను రూ.9 వేల కోట్ల నుంచి రూ.13 వేల 600కోట్లకు పెంచిందని, మహిళా సంఘాల రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచిందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని అన్నారు. ప్రతి గ్రామం నుంచి ఒకరు సుశిక్షితురాలైన రిసోర్స్ పర్సన్‌గా ఎదుగాలని కోరారు. సీఆర్సీ వ్యవస్థ బలోపేతానికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నామని, శిక్షణా ప్రణాళికలు తయారు చేసి మహిళల ఆలోచనలకు తగిన సహకారం అందిస్తామన్నారు. రైతు ఉత్పత్తి సంఘాల మాదిరిగా చిన్నచిన్న వ్యాపారాల సమూహాల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మహిళా సంఘాల కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బృందం సభ్యులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సన్మానించారు.
స్టాళ్ల సందర్శన : ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన పౌష్టికాహార ఉత్పత్తులు, నిత్యావసర పదార్థాలు, సబ్బులు, శానిటైజర్లు, గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం స్టాళ్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ వీఎస్ఎన్వీ ప్రసాద్, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ ప్రవీణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఆర్డీఓ కాళిందిని, డీపీఓ విష్ణువర్ధన్, ఎంపీడీఓ బీ. లాజర్, తాసీల్దార్ కృష్ణారెడ్డి, ఏపీఎం పద్మ పాల్గొన్నారు.