
దేవరకొండ, మర్రిగూడ మండలాల్లో కేంద్ర బృందం పర్యటన
కూలీలను కలిసి వివరాల సేకరణ
అభివృద్ధి పనులు, పంటల సాగు పరిశీలన
దేవరకొండ రూరల్/ మర్రిగూడ, ఆగస్టు 28 : కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చరంజిత్ సింగ్, డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్‌తో కూడిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం శనివారం దేవరకొండ, మర్రిగూడ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించింది. దేవరకొండ మండలం కొండభీమనపల్లి, తూర్పుపల్లి గ్రామాలకు వచ్చిన బృందానికి కొండభీమనపల్లి సర్పంచ్ మునికుంట్ల విద్యావతీవెంకట్రెడ్డి పూలమొక్కలను ఇచ్చి స్వాగతం పలికారు. గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో ఎన్ని మొక్కలు నాటారు, వాటి సంరక్షణ ఎలా ఉంది.. అని పంచాయతీ సెక్రటరీ నిరంజన్ను అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పథకం కింద అరెకరంలో పెంచుతున్న దొండ పందిరి యజమాని కె.పర్వతాలుతో సాగు, లాభాల విషయంపై ముచ్చటించారు. అనంతరం పల్లెప్రకృతి వనం, చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. అక్కడి నుంచి గ్రామ సచివాలయానికి చేరుకొని ఉపాధి కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి వారితో ముచ్చటించారు. జాబ్‌కార్డు ఉంటే 100రోజులు పని పొందే హక్కు, పని చేసే సమయంలో గాయపడితే ఆసుపత్రి ఖర్చులు, మరణిస్తే 50వేల నష్టపరిహారం పొందేహక్కు ఉన్నదని బృందం సభ్యులు వారికి తెలిపారు. ఉపాధిహామీ పథకంలో చేసిన పనులను ప్రశంసించారు. అనంతరం తూర్పుపల్లిలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి, తానేదార్పల్లి, సరంపేట గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులు బిల్లుల చెల్లింపుల ప్రక్రియలపై కూలీలు, అధికారుల నుంచి సమాచారం సేకరించారు. చర్లగూడెం రోడ్డుకు ఆనుకొని ఉన్న గుట్టల వద్ద ఉపాధి పనిలో చేపట్టిన బత్తాయి తోట, వరద కట్టలను పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద గేదెలను కొనుగోలు చేసి లబ్ధి పొందుతున్న రాంరెడ్డిపల్లికి చెందిన రైతు పాముల యాదయ్యను కలిసి వివరాలు తెలుసుకున్నారు. భూగర్బ జలాలు పెరిగేందుకు తీసిన ఫాంపౌండ్ గుంతలను అధికారులు పరిశీలించారు. సరంపేట బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి రఘునందన్‌రావు, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, స్పెషల్ కమిషనర్ ప్రసాద్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, డీఆర్డీఓ కాళిందిని, డీపీఓ విష్ణువర్దన్‌రెడ్డి, మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్, సర్పంచులు మునగాల యాదగిరిరావు, వెనమల్ల వెంకటమ్మ, ఎంపీటీసీ వెన్నమనేని శోభ, ఎంపీఓ ఝాన్సీరెడ్డి, ఈసీ వివేక్ పాల్గొన్నారు. దేవరకొండ మండలంలో ఎంపీడీఓ రామకృష్ణశర్మ, సర్పంచులు మునికుంట్ల విద్యావతీవెకట్రెడ్డి, ఎనిమల నిర్మల, సీఐ ఈదిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనునాయక్ పాల్గొన్నారు.