
నీలగిరి, ఆగస్టు 27 : వ్యవసాయంపై ఆధారపడిన రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు విద్యారుణాలను సహకార బ్యాంకు ద్వారా ఆందించనున్నట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మహాజన సభ సందర్భంగా సమావేశం నిర్వహించి, సీఎం కేసీఆర్‌పై రూపొందించిన ఒక్కగానొక్కడు పుస్తకాన్ని అవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయమే ఆధారంగా ఉన్న రైతాంగాన్ని అన్ని విధాలుగా అదుకునేందుకు సహకార బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి రైతుబిడ్డలకు విద్యారుణాలతోపాటు గృహ నిర్మాణ రుణాలను కూడా అతి తక్కువ వడ్డీకి అందించనున్నట్లు తెలిపారు. సుమారు 200మంది రైతు కుటుంబాల్లోని విద్యార్థులు ఉన్నత చదువులు, విదేశాల్లో చదివేందుకు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. దీర్ఘకాలిక రుణాలు ధరలకు అనుగుణంగా పెంచామని, మెట్ట భూములకు రూ.4లక్షలు, తరి భూములకు రూ.5లక్షలు అందించనున్నట్లు తెలిపారు. వీటితోపాటు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని అందులో రూ.11 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. అందులో పన్నులు మినహా రూ.6.58 కోట్లు నికర అదాయం వచ్చిందన్నారు. 103 సంవత్సరాల చరిత్రలో ఇంత అదాయం రావడం ఇదే ప్రప్రథమమని పేర్కొన్నారు. చేనేత సంఘాలకు సంబంధించి రూ.4.52 కోట్ల క్రాఫ్ట్ క్రెడిట్ రుణాలు అందించేందుకు, ఎంఎస్సీ ప్రోగ్రామ్ కింద 15 సంఘాలకు రూ.7. 58 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వయో పరిమితిని 61సంవత్సరాలకు పెంచుతూ తీర్మానించినట్లు వెల్లడించారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు రంగాచారి, అప్పిరెడ్డి, సైదయ్య, రామారావు, సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, మల్లేశ్, రమణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పాల్గొన్నారు.