
ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం
పల్లె ప్రగతి పనులతో పంచాయతీ అభివృద్ధి
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
రాష్ట్ర సర్కారు చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా ఉన్న గ్రామాల పరిస్థితి నేడు పూర్తిగా మారిపోయింది. మండలంలోని రోళ్లవారిగూడెం పల్లె ప్రగతి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నది. గతంలో దిర్శించర్ల పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామం సరిపడా నిధుల్లేక లేక అభివృద్ధిలో నీరసించింది. గ్రామానికి సరైన రహదారి కూడా ఉండేది కాదు. ప్రభుత్వం నూతన పంచాయతీగా ఏర్పాటు చేయడంతో అన్ని వసతులను సమకూర్చుకున్నది. వీధి దీపాలు, వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ సెడ్, డంపింగ్ యార్డు, సీసీరోడ్లు 80శాతం పూర్తయ్యాయి.
మురుగు కాల్వల శుభ్రం…
గ్రామంలో డ్రైనేజీ కాల్వలను పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. పల్లె ప్రగతి నిధుల నుంచి కొనుగోలు చేసిన ట్రాక్టర్లో చెత్త, చెదారం ఎప్పటికప్పుడు తరలిస్తుండగా రోడ్లన్నీ అందంగా కనిస్తున్నాయి. గతంలో గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు కూడా లేకపోగా వానొస్తే ఊరంతా మురికివాడగా మారేది. నేడు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుండడంతో సీసీరోడ్డు, డ్రైనేజీలు నిర్మించారు. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో రాత్రి సమయంలో తెల్లని వెలుగు కనువిందు చేస్తున్నది.
రోళ్లవారిగూడెంలో 160గృహాలు, 8వార్డులు ఉన్నాయి. 708మంది జనాభా నివసిస్తున్నారు. పంచాయతీ పరిధిలో మొత్తం 3ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి వెంట రూ.6.73లక్షలతో 30 కుంటల్లో 2వేల మొక్కలు, కోటయ్యగూడెంలో రూ.4.48లక్షలతో 20 కుంటల్లో 1500 మొక్కలు, బావోజీ తండా, కేతిరెడ్డిగూడెం గ్రామాలను కలుపుకొని రూ.3.36లక్షలతో 15కుంటల్లో వెయ్యి మొక్కలతో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు గ్రామానికి వన్నెతెస్తున్నాయి. హరితహారంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 11వేల మొక్కలను పెంచుతున్నారు.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు…
వైంకుఠధామం నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.50లక్షలు మంజూరు చేయడంతో సకాలంలో పనులు పూర్తయ్యాయి. గ్రామ శివారులో రూ.2.50లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. పంచాయతీ భవన నిర్మాణానికి రాష్ట్రీయ గ్రామీణ సడక్ యోజన పథకం కింద రూ.20లక్షలు మంజూరు కాగా పనులు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ పరిధిలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం సీడీఎఫ్ నిధుల నుంచి రూ.25లక్షలు, డీఎంఎఫ్టీ నుంచి 20లక్షలు, ఎన్ఆర్జీఎస్ నుంచి రూ. 5లక్షలు మంజూరయ్యాయి. గూడెం నుంచి మూసీఒడ్డు సింగారానికి వెళ్లే దారి మరమ్మతులకు రూ.5లక్షలు వెచ్చించారు. గ్రామంలో 80శాతం సీసీరోడ్లు పూర్తి చేశామని, మిగిలిన 20శాతం నిధులు మంజూరు కాగానే పూర్తి చేస్తామని గ్రామ సర్పంచ్ ఎస్కే హస్సేన్ తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులను రాజకీయాలకు అతీతంగా అన్ని అభివృద్ధి చేస్తున్నాం. గ్రామంలో 80శాతం సీసీరోడ్లు, డ్రైనేజీలను నిర్మించాం. మిగిలిన వీధుల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో సీసీరోడ్ల పనులు చేపడుతాం. పల్లె ప్రకృతి వనం, గ్రామ నర్సరీలను అందంగా తీర్చిదిద్దాం. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం.
పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. మాపై పనిభారం పెరిగినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం. పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలకు ట్యాంక్ ద్వారా నీటిని అందించి సంరక్షిస్తున్నాం.