
మండల పరిధిలోని మేజర్ పంచాయతీ కొరటికల్లో సుమారు 3,267 జనాభా, 1,307 కుటుంబాలు నివాసముంటున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలోని దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. ప్రణాళికాయుతంగా జరిగిన అభివృద్ధితో మౌలిక వసతులు సైతం మెరుగుపడ్డాయి.
రూ.30లక్షలతో మురుగు కాల్వలు…
గ్రామంలోని రోడ్లపై మూడు ఫీట్ల లోతు గుంతలు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇండ్ల మధ్యే మురుగు, వర్షం నీరు నిలిచి చిత్తడిగా మారేది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామసభ ఏర్పాటు చేసుకొని సమస్యలను గుర్తించారు. పంచాయతీ నిధుల నుంచి
రూ.30లక్షలతో మురుగుకాల్వలు, వార్డుల్లో రూ.43
లక్షలతో సీసీ రోడ్లు వేశారు. కంపచెట్లు తొలగించి, కొత్తగా 18 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి లూజు వైర్ల సమస్యను పరిష్కరించారు.
రూ.10లక్షలతో 240 ఎల్ఈడీ లైట్లను
అమర్చారు. పడావుపడ్డ పీహెచ్సీ, పాఠశాల భవనాలను కూల్చివేశారు. పంచాయతీ పరిధిలోని జోలంవారిగూడెంలో 10వేల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకును నిర్మించారు. గ్రామంలో రూ.5లక్షలతో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
చనిపోయినవారికి అంతిమ సంస్కారాలు
నిర్వహించేందుకు సర్వే నంబర్.177లో రూ.12.6లక్షలతో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రెండు బర్నింగ్ పాయింట్లు, దింపుడు కళ్లాలు నిర్మించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులు, ఆఫీస్ రూం, పూజ గది కూడా ఉంది.
రోజు విడిచి రోజు చెత్త సేకరణ…
ప్రభుత్వం రూ.10లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను సమకూర్చింది. దీంతో గ్రామంలో రోజు విడిచి రోజు పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. సర్వే నంబర్ 177లో రూ.2.5లక్షలతో నిర్మించిన కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 క్వింటాళ్ల ఎరువు తయారుకాగా గ్రామంలో హరితహారం, పల్లె ప్రకృతి వనం మొక్కలకు వేశారు. పనికిరాని చెత్తను వేసేందుకు రూ.50వేలతో డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు.
పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం..
సర్వే నంబర్ 476లో మూడెకరాల భూమిని గుర్తించి పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. ఇందులోని ఎకరం విస్తీర్ణంలో 3,133 మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. మరో ఎకరంలో కోతుల ఫలహారశాల కోసం బాదం, సీతాఫలం, చింత, మామిడి, అల్లనేరేడు, తదితర రకాలకు చెందిన 1,000 మొక్కలు నాటారు. మిగిలిన ఎకరంలో బ్లాక్ ప్లాంటేషన్ కింద 800 యూకలిప్టస్ మొక్కలు నాటారు. సర్వే నంబర్ 523లో బృహత్ పల్లె ప్రకృతి వనానికి అధికారులు 10 ఎకరాల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఇందులో 31వేల మొక్కలను నాటుతున్నారు. వీటితో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్లకు ఇరువైపులా 3,190 మొక్కలు నాటి రూ.2లక్షలతో ట్రీగార్డులను అమర్చారు. ఇండ్ల వద్ద నాటేందుకు గ్రామస్తులకు సుమారు 23,526 మొక్కలను పంపిణీ చేశారు.
మార్గదర్శకాల ప్రకారం పనులు
పల్లె ప్రగతి కార్యక్రమంలో మార్గదర్శకాల ప్రకారం గ్రామంలో అభి వృద్ధి పనులు జరిగేలా ప్రత్యేక చొరవతో పనిచేశాం. కొరటికల్లో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేశాం. పల్లె ప్రకృతి వనం, ఎవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్లో నాటిన మొక్కలను వందశాతం సంరక్షిస్తాం. గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుతో మా బాధ్యత మరింత పెరిగింది.
పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పల్లె ప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందాయి. మా గ్రామం లో గత కొన్నేండ్లుగా ఉన్న సమస్యలను సైతం పల్లె ప్రగతి ద్వారా పరిష్కరించుకున్నాం. గతంతో పోల్చితే గ్రామంలో పారిశుద్ధ్యం ఎంతగానో మెరుగుపడిం ది. నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పా టు చేసుకున్నాం. పల్లె ప్రకృతి వనాలతో గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కొరటికల్లో ఏర్పాటు చేయడం
హర్షణీయం.