
ఎన్జీ కాలేజీని సందర్శించిన న్యాక్ బృందం
తొలిరోజు వివిధ విభాగాల తనిఖీ
రామగిరి, ఆగస్టు 25 : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)ను బుధవారం న్యాక్ బృందం సందర్శించింది. కళాశాలకు న్యాక్ హోదా ముగియడంతో మళ్లీ గుర్తింపు కోసం దరఖాస్తు సమర్పించగా గత ఫిబ్రవరి 4, 5 తేదీల్లో నలుగురు సభ్యుల బృందం వచ్చి తనిఖీ చేసింది. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఫలితం ఇవ్వలేదు. తిరిగి గుర్తింపు ఇచ్చే క్రమంలో ప్రత్యేక పరిశీలనకు బుధ, గురువారం తనిఖీకి వచ్చింది. బుధవారం కళాశాలకు వచ్చిన బృందం సభ్యులకు ప్రిన్సిపాల్ కె.చంద్రశేఖర్, అధ్యాపకులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లు, క్యాడెట్స్, పీఓలు, ఆఫీసర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. జనవరి 26, 2021న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కంటిజెంట్ లీడర్‌గా పాల్గొని వచ్చిన కళాశాల అధ్యాపకుడు ఈ.యాదగిరిరెడ్డి ఎన్ఎస్ఎస్ పనితీరును వివరించడంతో ఆయనకు న్యాక్ బృందం అభినందనలు తెలిపింది. ఎన్సీసీ పురుషులు, మహిళల గౌరవ వందనం స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రజెంటేషన్‌తో వివరాలు..
తొలుత ప్రిన్సిపాల్ తన చాంబర్లో కళాశాల చరిత్ర, అభివృద్ధి కోర్సులు ఇతర వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో న్యాక్ బృందానికి వివరించారు. కళాశాలలో వివిధ విభాగాల హెచ్ఓడీలతో సమావేశమై వివరాలు, అభిప్రాయాలను బృందం సభ్యులు సేకరించారు. తర్వాత డిపార్టుమెంట్స్, పరీక్షల విభాగానికి వెళ్లి అమలు చేస్తున్న కోర్సులు, విద్యార్థులు, అధ్యాపకుల పనితీరు వసతులు పరిశీలించారు. గ్రంథాలయంలో 59,211 పుస్తకాలుండటం, ఈ-మొబైల్ లైబ్రరీ, తెలంగాణ యాప్ నిర్వహణ, ఎన్డీఎల్ఐ(నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్) చూసి గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు ఎ.దుర్గాప్రసాద్‌ను అభినందించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ పీడీ కడారి మల్లేశ్ ద్వారా విద్యార్థులకు ఇచ్చే ఇండోర్ గేమ్స్ యోగా, జిమ్ సెంటర్ తదితర అంశాలను తెలుసుకున్నారు. సాయంత్రం నిర్వహించిన అలూమినీ (పూర్వవిద్యార్థుల)సమావేశానికి ఎన్జీ పూర్వ విద్యార్థి ప్రస్తుత జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, పూర్వ విద్యార్థులు మాజీ ఎంజీయూ రిజిస్ట్రార్ నరేందర్‌రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్ ఎంవీ గోనారెడ్డితోపాటు పలువురు హాజరయ్యారు. అలూమినీ ఆధ్వర్యంలో కళాశాలకు అందించే కృషి, సహాయ సహకారాలను తెలుసుకుని నమోదు చేసుకున్నారు.
తడబడ్డ అధ్యాపకులు
పలు విభాగాల తనిఖీ, పరిశీలనకు వచ్చిన సంద ర్భంలో అధ్యాపకులు బృందం సభ్యులకు సమాధానం చెప్పడంలో తడబడ్డారు. దీంతో కళాశాలకు ప్రస్తుతం ఉన్న న్యాక్ గ్రేడ్ ఏ గుర్తింపు వస్తుందా…? హోదా పెరుగుతుందా…? అనేది వేచి చూడాల్సి ఉంది.
నేడు సైతం పరిశీలనలు
న్యాక్ బృందం రెండో రోజు కూడా కళాశాలలో పర్యటించనుంది. పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయనుంది. దానిని ప్రత్యేక కవర్లో ఉంచి సీల్ చేయనుంది.