
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ) : ఏ పార్టీకీ సాధ్యం కాని రీతిలో టీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా కొనసాగుతున్నది. కమిటీల ఏర్పాటులో స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరి అభిప్రాయాలతో సమష్టి నిర్ణయాలకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయి నుంచి
మొదలైన సంస్థాగత నిర్మాణంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వెల్లివిరుస్తున్నది. పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు కమిటీల నిర్మాణాల్లో అన్నివర్గాలకూ ప్రాధాన్యతనిస్తూ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు. కమిటీల్లోనూ పార్టీపరంగా చురుకైన వారిని ప్రత్యేకంగా గుర్తించి బాధ్యతలు అప్పజెప్పుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెజార్టీ ప్రాంతాల్లో యువతకే ఇస్తున్నారు. ఈ నెల 2 నుంచి మొదలైన పార్టీ, దాని అనుబంధ సంఘాల వార్డు, గ్రామ కమిటీల నిర్మాణం నేటితో పూర్తి కానుంది. ఇప్పటికే 90శాతం పూర్తి కాగా 100శాతం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక పార్టీ పటిష్టతకు క్షేత్రస్థాయి కమిటీలే బలమైన పునాది అని, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య బలమైన వారధిగా పార్టీని నిర్మించాలనేదే అధినేత సంకల్పమని మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండలో వార్డు కమిటీల ఏర్పాటు సమావేశంలో స్పష్టం చేశారు. రేపటి నుంచి మండల, పట్టణ కమిటీల ఎన్నికలు ప్రారంభిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు వెల్లడించారు.
పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శనంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో కీలకమైన వార్డు, గ్రామ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెల 2న పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. అదేరోజు నుంచి పట్టణాల్లో వార్డు కమిటీలు, గ్రామాల్లో గ్రామ కమిటీలు, వాటి అనుబంధ కమిటీల ఏర్పాటు ఉత్సాహంగా మొదలైంది. పార్టీ కమిటీల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేలా 51 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ కమిటీల ఎన్నిక పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలో పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలతోపాటు స్థానిక ఎమ్మెల్యేల పర్యవేక్షణలో క్షేత్రస్థాయి కమిటీల ఎన్నికలు పూర్తి చేశారు. శనివారం నాటికి జిల్లాలో 90శాతం కమిటీల ఎన్నిక పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన 10శాతం చివరి రోజైన ఆదివారం పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మెజార్టీ ప్రాంతాల్లో కమిటీల అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికకు పోటీ నెలకొన్నా అందరి అభిప్రాయాలకు విలువనిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి చేశారు. మెజార్టీ నిర్ణయం ప్రకారం సమర్థులైన వారికే కమిటీల్లో ప్రాధాన్యమిచ్చారు. ఇందులోనూ వీలైనంత వరకు పార్టీలో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని చురుకుగా వ్యవహరించే యువతకే నాయకత్వ పగ్గాలు అప్పజెప్పారు. ఎక్కువగా 30 నుంచి 40 ఏండ్ల మధ్య వయసున్న వారికే సారథ్య బాధ్యతలు దక్కినట్లు పార్టీ కమిటీలను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇక అనుబంధ సంఘాల్లోనూ ఆయా రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి అవకాశం కల్పించారు. దీంతో అందరికీ సమప్రాధాన్యం ఇచ్చినట్లయింది. రానున్న కాలంలో ప్రభుత్వానికి సమాంతరంగా పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పార్టీ కమిటీల కూర్పు జరిగినట్లు స్పష్టమవుతున్నది. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పార్టీ కమిటీలు బలంగా ఉండాలన్నదే పార్టీ ముఖ్య సూత్రంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే సంస్థాగత నిర్మాణాన్ని ఓ క్రమ పద్ధతిలో విజయవంతంగా నడిపిస్తున్నారు.
రేపటి నుంచి మండల, పట్టణ కమిటీలు
సంస్థాగత నిర్మాణ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి మండల, పట్టణ కమిటీల ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. గ్రామ కమిటీలన్నీ దాదాపు ఏకాభిప్రాయంతో పూర్తికావడంతో అదే ఒరవడితో మండల, పట్టణ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కీలక నేతలుగా ఉండి గ్రామాలు లేదా వార్డులను నడిపించగల సమర్థులైన నేతలకు మండల, పట్టణ కమిటీల్లో స్థానం కల్పించనున్నట్లు తెలిసింది. ఈ కమిటీలను 20 నుంచి 25 మందితో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 20 నాటికి వీటిని పూర్తి చేయాలని పార్టీ ఆదేశించింది. అయితే ఈ కమిటీల ఎన్నికలను జిల్లాలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతోపాటు ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించిన పార్టీ ఇన్చార్జీలు, స్థానిక ఎమ్మెల్యేలు స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఆయా గ్రామాలు లేదా వార్డు కమిటీల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు ఆయా మండలాలు లేదా పట్టణాల్లోని ముఖ్యులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. వీరందరి సమక్షంలో మండల లేదా పట్టణ కార్యవర్గాల ఎన్నికలను పూర్తి చేయనున్నారు. ఇక్కడ కూడా ఏకాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. మండల, పట్టణ కమిటీల ఎన్నికలు పూర్తయ్యాక జిల్లా కార్యవర్గంపై దృష్టి సారించనున్నారు.
పార్టీ పటిష్టతకు బలమైన కమిటీలే పునాది
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
రానున్న కాలంలో ప్రభుత్వానికి సమాంతరంగా పార్టీని తీర్చిదిద్దాలనేదే అధినేత కేసీఆర్ లక్ష్యం. అందుకే సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోనూ బలమైన కమిటీల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. స్థానిక పరిస్థితులపై అవగాహనతో ప్రజల్లో ఉంటూ, చురుకుగా వ్యవహరిస్తూ, సమన్వయంతో ముందుకు సాగే సామర్థ్యం ఉన్న వారికే కమిటీల్లో ప్రాధాన్యమిస్తున్నాం. ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వారధిగా కమిటీలు పని చేయాలన్నదే లక్ష్యం. ఆ దిశగా ఉమ్మడి జిల్లాలో సంస్థాగత నిర్మాణం కొనసాగుతున్నది.