e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home జిల్లాలు త్యాగానికి.. సెల్యూట్‌

త్యాగానికి.. సెల్యూట్‌

  • పోలీస్‌ అమరుల త్యాగం మరువలేనిది
  • కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన 27 మంది పోలీస్‌ సిబ్బంది
  • 31 వరకు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
  • నేడు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పోలీసు ఫ్లాగ్‌డే
  • ప్రజలకు చేరువగా సేవలు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తారు. సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించి ప్రజలకు రక్షణ కవచంగా నిలుస్తారు. రాత్రీపగలు అనే తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ కొన్నిసార్లు ప్రాణాలను సైతం కోల్పోతుంటారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకుంటూ ఏటా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. గతేడాది నుంచి పోలీసు ఫ్లాగ్‌డేగా పోలీసు శాఖ నామకరణం చేసింది. నేటి నుంచి ఈనెల 31 వరకు ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా పోలీసు అమరవీరులను స్మరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు నివాళులర్పించనున్నారు.
మెదక్‌, అక్టోబర్‌ 20 : అక్టోబర్‌ 21 అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్ధంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజున స్మరించుకుంటూ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ యోధుల త్యాగాలను స్మరించుకుందాం. 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అనునిత్యం పోరాడుతున్నారు. మనం ప్రతిరోజూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది పోలీసులు అప్రమత్తంగా ఉండడమే. తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. అందుకే పోలీసు శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడుతూ కొంతమంది పోలీసులు అసువులు బాసారు. అలాంటి అమరుల త్యాగాల మరువలేనివి. వారిని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల సంస్మరణ దినం(పోలీస్‌ ఫ్లాగ్‌డే) నిర్వహిస్తున్నారు.

మెదక్‌ జిల్లాలో 14 మంది అమరులు..

- Advertisement -

1999 సెప్టెంబర్‌ 13న మెదక్‌ జిల్లా పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌లో నైట్‌ డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.రఘునందన్‌, కానిస్టేబుళ్లు ప్రసాద్‌, రాంచందర్‌, నర్సింహులు, ఆబేద్‌ హుస్సేన్‌పై పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు కాల్పులు జరిపారు. పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆయుధాల కోసం వచ్చిన పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు, పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న వీరిని చంపి ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌ను పేల్చివేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆయుధాలను ఎత్తుకుపోయారు. 1991 ఏప్రిల్‌ 4న కౌడిపల్లి మండలం ధర్మాసాగర్‌లో నక్సలైట్లు ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకు కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్సై దామోదర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ మల్లేశం అక్కడికి వెళ్లారు. అక్కడ కాపుకాసిన నక్సలైట్లు ఎస్సైతో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ను పిస్తల్‌, 9ఎంఎం కార్బన్‌తో కాల్చిచంపారు. 1997 నవంబర్‌ 11న శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో ఓ ఇంట్లో పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు సమావేశం నిర్వహించుకున్నారనే సమాచారంతో తూప్రాన్‌ డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తూప్రాన్‌ సీఐ వెంకటస్వామి, హెడ్‌కానిస్టేబుల్‌ పెంటయ్య, శివ్వంపేట కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్‌నాయక్‌, సుజాయత్‌అలీ అక్కడికి వెళ్తుండగా పేలుడు పదార్ధాలు పేలి అక్కడికక్కడే మృతి చెందారు. 1996 నవంబర్‌ 11న రాములు అనే ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ నక్సలైట్‌ను మెదక్‌ నుంచి నిజామాబాద్‌ కోర్టుకు తీసుకెళ్తుండగా, బాన్సువాడ ప్రాంతంలో ఆర్టీసీ బస్సును అడ్డగించిన నక్సలైట్లు తుపాకితో రాములును కాల్చిచంపారు.

అమరుల కుటుంబాలకు అండగా సర్కారు..

పోలీసు అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయా సంఘటనల్లో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చింది. మెదక్‌ జిల్లాలో 14 మంది పోలీసులు అమరులయ్యారు. అందులో ఒకరు డీఎస్పీ కాగా, ఒకరు సీఐ, ఒకరు ఎస్సై, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలను కల్పించింది.

ఫ్లాగ్‌ డే కార్యక్రమం ఇలా..

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను గతేడాది నుంచి ఫ్లాగ్‌డేగా చేస్తున్నారు. మెదక్‌ జిల్లా పరిధిలోని విద్యార్థిని, విద్యార్ధులకు వ్యాసరచన పోటీలతో పాటు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫిక్‌ సంబంధించి రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నదని మెదక్‌ జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థులతో పాటు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. వ్యాసరచన పోటీలకు ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులను ఒకటో కేటగిరీ, ఇంటర్మీడియెట్‌ చదివే విద్యార్థులను రెండో కేటగిరీగాను, డిగ్రీ విద్యార్థులను మూడో కేటగిరీగా నిర్ణయించినట్లు తెలిపారు. మూడు కేటగిరీలకు చెందిన విద్యార్థులు ‘భారతదేశ అభివృద్ధిలో పోలీసుల పాత్ర’ అనే అంశంపై ttps:// forms.gle/ HvF8YAgewvyD3wjA9 ఈ లింక్‌ ద్వారా వ్యాసరచన పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని, ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొనే వారు ఆన్‌లైన్‌ కాని లేదా పేపర్‌ పైన రాసి కూడా ఆ పేపర్‌ను ఫొటోతీసి పైన తెలిపిన లింక్‌లో అప్‌లోడ్‌ చేసే అవకాశం కలదన్నారు. ఈ వ్యాసరచన పోటీలకు చివరి తేదీ ఈనెల 24న నిర్ణయించగా, అలాగే ఫొటోగ్రఫీ పోటీలకు సంబంధించి కమ్యూనిటీ పోలీసింగ్‌, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవలతో పాటు ఇతర సందర్భాల్లో పోలీసుల కిర్తీ ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2020 అక్టోబర్‌ నుంచి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్‌ 28వ తేదీ మధ్యకాలంలో తీసిన మూడు ఫొటోలనుhttps://forms.gle/uJj58xXN1GQ PNjp8 A ఈ లింక్‌ ద్వారా తమ పూర్తి వివరాలతో ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం శ్రమించి అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విద్యార్థులతో పాటు ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement