
మెదక్, ఆగస్టు 17 : చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యాక్సిన్ చిన్నారుల ప్రాణానికి రక్షణగా నిలుస్తున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వం పీవీసీ వ్యాక్సిన్ తీసుకొచ్చింది. చిన్నారుల్లో అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యతో పాటు శ్వాస సమస్యలు ఎదురవకుండా ఉండేందుకు న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)ను పంపిణీ చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇప్పటికే మెదక్ కలెక్టర్ హరీశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18న జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పుట్టిన ఆరు వారాలకు మొదటి డోసు, 14 వారాలకు రెండో డోసు, తొమ్మిదో నెలకు మూడో డోసును వేయించాలి. ఆలస్యమైతే మొదటి పుట్టిన రోజుకు ముందు కనీ సం ఒక మోతాదు పీసీవీని వేసి ఉంటే మిగతా వాటిని ఇవ్వవచ్చు. పీసీవీ టీకాను కేవలం ప్రైవేట్ దవాఖానల్లో మాత్రమే చిన్నారులకు ఇచ్చేవారు. ప్రస్తుతం సర్కార్ ప్రభుత్వ దవాఖానల్లో వేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18 నుంచి జిల్లాలో పీసీవీ టీకా వేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1750 డోసులు అందుబాటులో ఉన్న ట్లు వైద్యాధికారులు తెలిపారు.
న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) టీకాతో మరణాల శాతం తగ్గే అవకాశముంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లో బ్యాక్టీరియా పరాన్నజీవులు, జీర్ణాశయంలోకి ఆహారం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో జలుబు ముదిరి నిమ్మ సమస్య ఏర్పడుతుంది. దీని నివారణకు ప్రైవేట్ దవాఖానలో వీటి ఖరీదు రూ.2500 నుంచి రూ.3వేల వరకు ఉంటుంది. చాలామంది పిల్లలు న్యూ మోనియా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం పీసీవీ టీకాను అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో టీకాను పంపిణీ చేయనున్నది.
న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) టీకాను విజయవంతం చేసేందుకు ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ప్రచారం నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేం ద్రాల వద్ద పీసీవీ టీకా ఆవశ్యకతపై అవగాహన బోర్డులను సైతం ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరీశ్ ఆదేశాలు జారీ చేశారు. టీకా గురించి ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇం టింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించి చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. న్యూమోకోకల్ వ్యాధి అనేది స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహం, న్యూమోనియాకు జ్వరం, వణుకు, దగ్గు, మైనింజైటీస్కు జ్వరం, తలనొప్పి, కాంతిని భరించలేకపోవడం, మెడగట్టి పడడం, మూర్చ వంటి లక్షణాలు చిన్నారుల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న చిన్నారులకు సరైన సమయంలో చికిత్స అందించలేకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పీసీవీ టీకా వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పీసీవీ టీకాను పంపిణీ చేస్తాం. జిల్లాకు 1750 పీసీవీ వ్యా క్సిన్ డోసులు చేరుకున్నాయి. ఏడాదిలోపు మూడు డోసులు తీసుకోవాలి. ఇప్పటికే జిల్లా వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత టీకాను సద్వినియోగం చేసుకొని చిన్నారులకు అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తపడాలి.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్‌వో, మెదక్