
మనోహరాబాద్, ఆగస్టు 17 : కూలీ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఆనందంగా జీవించే ఆ కుటుంబంలో సాయంత్రం విందు విషాదాన్ని నింపింది. అప్పటి వరకు సరదాగా గడిపిన పిల్లలు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కలుషిత ఆహారం తీసుకొని ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై రాజుగౌడ్ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన బుల్లె మల్లేశ్, బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు మనూషా, కుమార్ ఉన్నారు. మల్లేశ్ బతుకుదెరువు కోసం మనోహరాబాద్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. మనోహరాబాద్‌కు చెందిన సంద ఐలయ్య కోళ్లఫారంలో 8 నెలల క్రితం జీతానికి కుదిరాడు. భార్యాపిల్లలతో కోళ్లఫారంలో కావలిగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి కోళ్లఫారంలోని బలహీనంగా ఉన్న కోళ్లను కొనుక్కొని వంట చేయించుకున్నాడు. భార్య బాలమణి, పిల్లలు మనూషా, కుమార్‌తో కలిసి రాత్రి భోజనం చేసి కూల్‌డ్రింక్ తాగి పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మనూ షా, కుమార్, బాలమణి తీవ్ర కడుపునొప్పి, వాంతులు, విరేచనలతో బాధపడ్డారు. దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో మేడ్చల్‌లోని మెహర్ దవాఖానకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో తిరిగి తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మనూషా (13), కుమార్ (10) మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బాలమణి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడే చికిత్స చేస్తున్నారు. మృతుల తండ్రి బుల్లె మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజుగౌడ్ తెలిపారు.
ఇద్దరు చిన్నారుల మృతితో వెంకటాయపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతేడాది వరకు మల్లేశ్ ఇక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కూరగాయలు అమ్ముకునే వాడని, ఆర్థిక ఇబ్బందులు రావడంతో వలస వెళ్లాడని, అతని పిల్లలు ఇద్దరు కలుషిత ఆహారంతో మృతిచెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.