
వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్), సెప్టెంబర్ 16: ప్రతినీటి బొట్టునూ ఒడిసిపట్టి సాగులో గణనీయమైన మార్పులు తీసుకొచేందుకు మన మంతా కృషిచేయాలని, రైతుకు ఎంత అండగా ఉంటే దేశంలో అంత మార్పు సాధ్యమవుతుందని భారత మాజీ వ్యవసాయ కార్యదర్శి ఎస్కే పట్నాయక్, సీహెచ్ఏఐ చైర్మన్ డాక్టర్ హెచ్‌పీ సింగ్ అన్నారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఫర్డ్రాఫ్, మోర్ క్రాఫ్ (ప్రతినీటి బొట్టుకూ ఎక్కువ పంట ) సమావేశానికి వారు ముఖ్య అథితులుగా పాల్గొని మాట్లాడారు. దేశం అతి త్వరలోనే నీటి సంక్షోభాన్ని ఎదురుకొనే ప్రమాదం ఉందని హెచ్‌పీ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సంక్షోభం తప్పదన్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా రోజురోజుకూ నీటి లభ్యత, తలసరి నీటి వినియోగం తగ్గుతున్నాయన్నారు. ఈ అంశంపై అందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. వర్సిటీ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి వీసీ ప్రవీణ్‌రావు ఎంతో కృషిచేశారని పట్నాయక్ అభినందించారు. తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధిలో పీజేటీఎస్ఏయూది కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. రోజురోజుకూ నీటి అవసరాలు పెరుగుతున్నందున నీటి సామర్ధత యాజమాన్యం అత్యంత అవశ్యకమని పట్నాయక్ అన్నారు. ఈ సందర్బంగా ఏఎస్ఎమ్ ఫౌండేషన్ వివిధ అవార్డులు ప్రకటించింది. వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్‌రావు కొన్నేండ్లుగా వ్యవసాయ రంగానికి మైక్రో ఇరిగేషన్‌లోనూ చేస్తున్న కృషికి గుర్తింపుగా అవార్డు అందుకున్నారు. వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. 2014లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. అనతి కాలంలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో పాటు సాగునీటి సౌకర్యం పెద్ద ఎత్తున కల్పిస్తోందన్నారు. తద్వారా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. నేడు తెంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని ఎఫ్‌సీఐ సైతం ధ్రువీకరించిందన్నారు.ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో వ్యవసాయ పరిశోధనలకు రూ.100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నూనెగింజల ఉత్పత్తిలో ఇంకా వెనకబడే ఉన్నామన్నారు. వాతావరణ మార్పులు, నీటి సామర్ధత యాజమాన్యం, పంటల వైవిధ్యం, వ్యవసాయ యాంత్రీకరణ, సరైన ఎరువుల వినియోగం తదితరాలు నేడు మన ముందున్న ప్రధాన సవాళ్లని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రపం చం అబ్బురపడే విధంగా స్వల్పకాంలోనే కృష్ణ, గోదావరి నదులపై అనేక ప్రాజెక్టులను పూర్తిచేసి తాగు, సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. నీటి వనరులు తక్కువగా ఉన్న చోట సైతం ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి మంచి ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఆన్, ఆఫ్‌లైన్‌లో జాతీయస్థాయి వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక రంగ ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పలువురికి అవార్డులు అందజేశారు.