
కోహీర్, ఆగస్టు 16 : ఓ రైతు నుంచి రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు నాయబ్ తహసీల్దార్, వీఆర్ఏ పట్టుబడిన సంఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ తహసీల్ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకొంది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వివరాల ప్రకారం.. కోహీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు వీరయ్య తన భూమికి సంబంధించిన సర్వేనంబర్ 99లోని పహాణి, కాస్రా, ఆర్ఓఆర్, వన్ బీ రికార్డుల పత్రాలు కావాలని కోహీర్ తహసీల్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ బస్వరాజ్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం పత్రాలన్నీ ఆయనకు అందజేశారు. పత్రాలను తీసుకునే సమయంలో రైతు వీరయ్య వెయ్యి రూపాయలను సమర్పించాడు. కానీ, నాయబ్ తహసీల్దార్ అసంతృప్తి చెంది తనకు రెండు వేల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో రైతు చేసేదేమి లేక అక్కడి నుంచి వెళ్లి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రైతు వీరయ్యతో పాటు ఏసీబీ సిబ్బంది తహసీల్ కార్యాలయానికి వచ్చారు. గురుజువాడ వీఆర్ఏ వీరన్నకు రెండు వేల రూపాయలను రైతు అందజేశాడు. అతడు డబ్బులను తీసుకొని నేరుగా వెళ్లి నాయబ్ తహసీల్దార్‌కు ఇవ్వడంతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాలుగు ఐదు వందల రూ పాయల నోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో ఏసీబీ డీఎస్పీ వెంట ఎస్సైలు రమేశ్, వెంకటరాజుగౌడ్, సిబ్బంది ఉన్నారు.