
వెల్దుర్తి, ఆగస్టు 14: గుట్టపై నుంచి జాలువారుతున్న నీ టిధారలు, ఎతైన గుట్టలు, పచ్చని చెట్లు, గుట్ట కింది భాగంలో బండరాతి కింద సహజసిద్ధ్దంగా వెలిసిన స్వయంభూ శివ లింగం. వెల్దుర్తి మండల పరిధిలోని బస్వాపూర్‌లోని భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి(మల్లన్న గుట్ట) దేవాలయం ప్రత్యేకతలు. 1162వ సంవత్సరంలో కాకతీయరాజు ప్రతాపరుద్రుడు ఈగుట్ట ప్రాంతంలో భారీ కోట నిర్మాణానికి సన్నద్ధం కాగా రుషులు, గురువులు వ్యతిరేకించడంతో గోడల నిర్మాణంలోనే నిలిపివేశారు. ఇప్పటికే ఆలయం పై భాగంలో గోడ నిర్మాణానికి సంబంధించినవి అనవాళ్లు కనిపిస్తాయి.
ఈ అలయంలో రెండు శివలింగాలు ఉండగా, ఒకటి స్వయం భూగా వెలిసిన శివలింగం , మరొకటి ప్రతిష్ఠించిన శివలింగం. స్వయంభూ శివలింగం ఏటా పెరుగుతూ ఉండడం, భక్తులు కోరిన కోరికలు తీరుతుండడంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. ప్రధాన ఆలయం ఎదుట కాకతీయుల కాలం నాటి గణపతి విగ్రహం ప్రతిష్ఠించడంతో దాని చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం ముందు భాగంలో కాకతీయుల కాలంలో నిర్మించిన లోతైన పెద్ద కోనేరు , దిగడానికి మెట్లు ఉన్నాయి. ఆలయం పై భాగంలో ఉన్న గుట్టపై నుంచి నీళ్లు పారుతూ కోనేరులోకి వస్తాయి.కోనేరులో స్నానం చేస్తే వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆలయ ఆవరణలో దాతల సహకారంతో విశాలమైన కల్యాణ మం డపం, పంచముఖీ హనుమాన్, నవగ్రహాల ఆలయాలను నిర్మించారు.
ప్రతి సోమవారం పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహిస్తారు. శివుని ప్రత్యేక రోజులైన మ హాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, శ్రావణమాసం, కార్తీక మాసంలో భక్తులు ఉమ్మడి మెదక్‌తో పాటు చుట్టు పక్కల ఉన్న జిల్లా లు, హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమినాడు ఆలయ ప్రాంగణలో లక్ష దీపార్చన చేస్తారు. ఏటా శివపార్వతుల కల్యాణం, ఆలయ వార్షికోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
ఎతైన గుట్టలు, కొండలు, పచ్చని చెట్లు, గుట్ట కింది భాగంలో ఆలయం ఎదుట కోనే రు, చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే మల్లికార్జున స్వామి దేవాలయం(మల్లన్నగుట్ట) సినిమా, సీరియల్ షూటింగ్‌లకు నిలయం. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న అ సలేం జరిగింది సినిమా తో పాటు గతంలో కూడా షూటింగ్‌లు చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 75 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన మెదక్‌కు 25, నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌కు 26, మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో వెల్దుర్తి-నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన ఉంది. హైదరాబాద్ నుంచి తూప్రాన్, వెల్దుర్తిల మీదుగా, మెదక్ నుంచి వెల్దుర్తి మీదుగా, నర్సాపూర్ నుంచి కుకునూర్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.