
మెదక్ కలెక్టర్ హరీశ్
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
హాజరుకానున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్
అతిథులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 13: కలెక్టరేట్ ఆవరణలోని మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్లతో కలిసి పరిశీలించారు. అతిథులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులకు సూచించారు. కుర్చీలు ఏర్పాటు చేసి, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. డీఆర్టీవో, వ్యవసాయ, ఉద్యాన, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతకాన్ని ఆవిష్కరించనున్నారని తెలిపారు. వేదికను అందంగా అలంకరించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విశిష్ట సేవలందిస్తున్న ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నామన్నారు. కలెక్టర్ వెంట డీఆర్టీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీఆర్వో శాంతికుమార్ అధికారులు పాల్గొన్నారు.