
ఆకాశానికి రంగులద్దే పండుగ..! రానే వచ్చింది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎగురవేసే అనేక రకాల గాలిపటాలతో నింగి మొత్తం సప్తవర్ణ తేజోమయమవుతుంది. అలాంటి సంక్రాంతి పండగ మన ఇండ్లల్లో కాంతులు నింపాలి కానీ, దుఖాఃన్ని కాదు.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ పతంగులు ఎగురవేసి పండుగ జరుపుకోందాం..
పెద్దశంకరంపేట, జనవరి 12: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నారుల నుంచి యువకుల వరకు అందరికీ గుర్తుకు వచ్చేది పతంగులు ఎగురవేయడం. అలాంటి పండుగ ఆనందంగా జరుపుకోవాలంటే చిన్నారులు తప్పకుండా జాగ్రత్తలు పాటించినప్పుడే పండుగ ఆనంద భరితమవుతుంది. సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. చిన్నారులు మూడు నుంచి ఐదు రోజుల పాటు పతంగులను ఎగురవేస్తుంటారు. చిన్నారులు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదం బారినపడే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 11న మంగళవారం నారాయణఖేడ్‌లో పతంగులు ఎగురవేస్తూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పతంగులు ఎగురవేసే చిన్నారులు, యువకులు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పతంగులు ఎగిరేసే వారికి విద్యుత్‌శాఖ సూచనలు…
విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్నచోట పతంగులు ఎగురవేయక పోవడమే శ్రేయస్కరం.
విద్యుత్ వైర్లకు పతంగులు తగిలి చుట్టుకోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశమున్నది.
విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు లేని ఖాళీ ప్రదేశాల్లో పతంగులు ఎగురవేయాలి.
జాగ్రత్త వహించాలి..
అందోల్, జనవరి 12: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సెలువులు రావడంతో పిల్లలు సంతోషంగా పతంగులు ఎగురవేస్తుంటారు. వారు పతంగులు ఎగురవేసే సమయంలో పెద్దవారు వారి వెనకే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. గాలిపటాల దారం తెగి చెట్లు, విద్యుత్ స్తంభాలు,తీగలకు చిక్కుకున్నప్పుడు కొంతమంది కర్రలతో కొట్టడం లాంటివి చేస్తుంటారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. పెద్ద బిల్డింగ్‌లపై పతంగులు ఎగురవేస్తూ.. దారం తెగిన పతంగులను పట్టుకునేందుకు పరిగెత్తడం లాంటివి చేయకుండా పిల్లలకు తగిన సూచనలు చేయాలి. గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు, వీధుల్లో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు, పాడుబడిన బావులు, పెద్ద గుంతల వద్ద ఎట్టి పరిస్థితిలో పతంగులు ఎగురవేయనివ్వకూడదు.
పతంగుల సందడి
సిద్దిపేట కమాన్, జనవరి 12: సంక్రాంతి పండుగ సందర్భంగా సిద్దిపేటలో పతంగుల సందడి మొదలైంది. పాఠశాలలకు సెలవులు రావడం ఓ వైపు.. మరోవైపు సంక్రాంతి పండుగ కావడంతో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల ఇష్టాలకు అనుగుణంగా మార్కెట్లో వివిధ రకాల పతంగులను దుకాణదారులు అందుబాటులో ఉంచారు. డాబాలు, వీధులు, స్టేడియాలు.. వివిధ ఆవరణల్లో పతంగులను సంతోషంగా ఎగురవేస్తున్నారు. పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు. బంగ్లాపై ఎగురవేసేటప్పుడు పెద్దల సమక్షంలో ఎగురవేయాలని చెబుతున్నారు. డాబాలపై కాకుండా ఖాళీ ప్రదేశాల్లో ఎగురవేయడం మంచిదంటున్నారు.