
ఆది పూజల దేవుడు శుక్రవారం కొలువుదీరాడు. మండపాల్లో పూజలు అందుకున్నాడు. ఉదయం నుంచే విగ్రహాలను మండపాళ్ల వద్దకు తరలించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, గణనాథులను నెలకొల్పారు. ఈ ఏడాది కరోనా నిబంధనల మేరకు అధికారుల అనుమతితో గణేశ్ నవరాత్రి ఉత్సవ కమిటీ నిర్వాహకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మండపాళ్ల వద్ద ప్రతిష్ఠిచిన లంబోధరుడికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో
భాగంగా విత్తన, మట్టి గణపతులను ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు,
సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. విఘ్నరాజా.. లంబోధరా.. గజానాన.. గౌరీపుత్ర.. బుద్ధి ప్రధాతా.. ఏకదంతా.. ఇలా 108 నామాలతో వినాయకుడి పిలుస్తారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం చవితి రోజున వినాయక చవితిని నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో పెద్దలు, పిల్లలు, ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద సందడి నెలకొన్నది.
ఘనంగా వినాయక చవితి
మెదక్, సెప్టెంబర్ 11 : వినాయక చవితి పండుగను శుక్రవారంజిల్లా వ్యాప్తంగా భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించలేదు. ఈ ఏడాది కరోనా నిబంధనల మేరకు నిర్వహించుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, ఎస్పీ చందనదీప్తి అనుమతి ఇచ్చారు. ఉత్సవ కమిటీలు పెద్ద ఎత్తున మండపాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచే ఏర్పాటు చేసిన మండపాళ్లలో గణనాథులను ప్రతిష్ఠించారు. దీంతో వినాయక మండపాల వద్ద భక్తుల సందడి నెలకొన్నది.
జిల్లా అంతటా పండుగ వాతావరణం..
వినాయక చవితి పండుగ సందర్భంగా మెదక్ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాలోని మెదక్ పట్టణంలోని ఆయా వార్డుల్లో గణనాథులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. జిల్లాలోని నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, చేగుంట, హవేళీఘనపూర్, కౌడిపల్లి, కొల్చారం, పెద్దశంకరంపేట, టేక్మాల్‌తో పాటు తదితర మండలాల్లో వినాయక చవతి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలనుకునే వారు ముందుగా మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలు సూచించారు. దీంతో జిల్లాలో 2040 మండపాలకు అధికారులు అనుమతి ఇచ్చారు.
విత్తన గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో గతంలో మాదిరిగా ఈసారి కూడా వినాయక చవితి పండుగ సందర్భంగా విత్తన గణపతులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు, యువజన సంఘాలకు పంపిణీ చేశారు. అంతేకాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు.
78వ సంబురం
కోహీర్, సెప్టెంబర్ 11 : కోహీర్ పట్టణంలోని సరస్వతీ శిశుమందిరంలో స్వాతంత్య్రానికి ముందు నుంచే గణనాథుడి విగ్రహాన్ని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠిస్తున్నారు అక్కడి ప్రజలు. శుక్రవారం వినాయక చవితిని పురస్కరించుకొని 78వ సంవత్సరం కూడా వినాయక ప్రతిమను సరస్వతీ శిశుమందిరంలో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ప్రజలు గుమికూడొద్దని బ్రిటీష్ పాలకుల ఆంక్షలు ఉండేవి. దీంతో ఎలాగైన తాము ఒక్కచోటుకు చేరాలని కోహీర్ పట్టణానికి చెందిన ప్రముఖులు 1943లో చర్చించుకున్నారు. తద్వారా సార్వజనిక వినాయక మండలి పేరుతో శిశుమందిరంలో తొలిసారిగా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నవరాత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ, భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం తొమ్మిదొవ రోజుకి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. తమ పూర్వీకులు 1943లో తొలిసారిగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారని సార్వజనిక వినాయక మండలి యువకులు చెబుతున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకొంటూ జైబోలో గణేశ్ మహారాజ్‌కి జై అంటూ.. వారు సగర్వంగా నినదిస్తున్నారు.