
సిద్దిపేట, ఆగస్టు 8 : ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగులకు వేతనాలు పెంచలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణం మెట్రో గార్డెన్లో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, టీచర్లకు పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు ఉపాధ్యాయులు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావును ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఉద్యోగులతో పాటు సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, కనీస మద్దతు ధరతో పంట కొనుగోలు చేసి వ్యవసాయాన్ని పండుగగా మార్చామన్నారు. ఆశ, అంగన్వాడీ, హోంగార్డ్‌లతో సహా అన్ని రంగాల్లో ఉద్యోగులకు వేతనాలు పెంచామన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలను స్వచ్ఛ పల్లెలు, పట్టణాలుగా తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట తెచ్చి పెట్టామన్నారు. విద్యుత్, తాగునీటి రంగంలో అద్భుత ప్రగతిని సాధించామని, రానున్న రోజుల్లో విద్య, వైద్యరంగాల్లో గణనీయమైన అభివృద్ధి చూస్తామన్నారు. కరోనా వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురైనా తలసరి ఆదాయంలో సౌత్ ఇండియాలో మనమే నంబర్ వన్‌గా నిలిచామన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల రేషన్ బియ్యం పెంపుతో పాటు ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ప్రజల వెన్నంటే ఉన్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 238 గురుకులాలు ఉండగా, ఇప్పుడు 916 గురుకులాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి లక్షా 12వేల మంది గురుకులాల్లో చదువగా, ప్రస్తుతం 4లక్షల 60వేల మంది చదువుతున్నారని తెలిపారు. ఫారెస్టు, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలను స్థాపించి నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.
యువ పారిశ్రామిక వేత్తల కోసం నూతన భవన నిర్మాణం సిద్దిపేట అర్బన్, ఆగస్టు 8 : చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సిద్దిపేట ఇండస్ట్ట్రియల్ పార్కు చిరునామాగా.. సరికొత్త ఆర్థిక సంస్థల కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ఇండస్ట్రియల్ పార్కులోని ఐదెకరాల స్థలంలో రూ.10కోట్లతో నిర్మిచబోయే ప్లగ్ అండ్ ప్లే మోడల్ భవన నిర్మాణానికి ఆదివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 8 నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లోని 16 మంది బిజినెస్ వ్యవస్థాపకులుగా మార్చనున్నట్లు తెలిపారు. సొంత డబ్బులతో భవనాన్ని నిర్మించుకొని పరిశ్రమ పెట్టలేని వారికి ఇంది మంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన వ్యవస్థాపకులను ప్రోత్సహించడం ద్వారా కొత్త పరిశ్రమలు నెలకొల్పడం సాధ్యమవుతుందని కోరగానే భవన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు ఉన్నారు.