మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో దూసుకెళ్తున్నది. గడువు కంటే ముందే లక్ష్యం అధిగమించే దిశగా అడుగులు వేస్తున్నది. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టిసారించారు. దీంతో మణుగూరు ఏరియా 100.21 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. సింగరేణి వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఏరియా వార్షిక నిర్దేశిత లక్ష్యం 112 లక్షల టన్నులు కాగా.. ఇప్పటివరకు 96.97 లక్షల టన్నులు వెలికితీశారు. లక్ష్యం చేరుకునేందుకు మరో రెండున్నర నెలల సమయం ఉంది. అంతకంటే ముందే బొగ్గు ఉత్పత్తి లక్ష్యం అధిగమిస్తామని అధికారులు పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా తరలించిన బొగ్గులో మణుగూరు నుంచే 19.3 శాతం నమోదైంది. దీంతో సింగరేణి అధికారులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మణుగూరు రూరల్, జనవరి 20: బొగ్గు వెలికితీతలో ఎప్పుడూ ముందంజలో ఉంటూ సింగరేణి వ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకునే మణుగూరు ఏరియా మరో రికార్డు నమోదు చేసుకున్నది. 100 లక్షల టన్నులకు పైగా బొగ్గు రవాణా చేసి సింగరేణి వ్యాప్తంగా రెండోస్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైలు, రోడ్డు, రోప్‌వే ద్వారా 100 లక్షల టన్నుల బొగ్గును తరలించిన మైలురాయిని అధిగమించింది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా తరలించిన బొగ్గులో మణుగూరు నుంచే 19.3 శాతం నమోదైంది. దీంతో సింగరేణి అధికారులు, కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నిరంతర కృషి..
గతేడాది కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపినప్పటికీ అధికారుల ప్రత్యేక చర్యల నేపథ్యంలో 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో బొగ్గు వెలికితీత, తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించిన ఏరియా అధికారులు.. సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఏరియాలోని 2,763 మంది ఉద్యోగులు ఓసీ-2, ఓసీ-4, మణుగూరు ఓసీ, కేపీయూజీ మైన్ల నుంచి బొగ్గు వెలికితీశారు. కేసీహెచ్పీ ద్వారా బొగ్గును రోడ్డు, రైలు, రోప్‌వే మార్గాల ద్వారా తరలించారు. ఆటంకం ఏర్పడకుండా పూర్తిస్థాయి, యంత్ర సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టారు. జనవరి 19 నాటికి భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌కు, ఇతర సిమెంట్ కంపెనీలకు రోడ్డు మార్గం ద్వారా 31.95 లక్షల టన్నులు తరలించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ర్టాల్లోని విద్యుత్ ప్లాంట్లకు రైలు ద్వారా 63.82 లక్షల టన్నులను పంపారు. మణుగూరు (అశ్వాపురం) హెవీవాటర్ప్లాంట్కు రోప్‌వే ద్వారా 4.44 టన్నులు తరలించారు. దీంతో మొత్తం మణుగూరు ఏరియా నుంచి 100.21 లక్షల టన్నుల రవాణా జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏరియా వార్షిక నిర్దేశిత లక్ష్యం 112 లక్షల టన్నులు కాగా, ఇప్పటి వరకు 96.97 లక్షల టన్నులు వెలికితీశారు. టార్గెట్ పూర్తి చేసేందుకు మరో రెండున్నర నెలల సమయం ఉంది. అంతకముందే లక్ష్యాన్ని అధిగమించి బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఏరియాల వారీగా బొగ్గు తరలింపు వివరాలివీ..
ఏరియా బొగ్గు తరలింపు (టన్నుల్లో)
మణుగూరు 1,00,21,183
కొత్తగూడెం 99,52,727
ఇల్లెందు 53,01,342
రామగుండం -1 17,57,143
రామగుండం-2 69,66,445
రామగుండం-3 55,71,753
భూపాలపల్లి 16,96,567
ఆడ్రియాల 30,695
బెల్లంపల్లి 16,64,363
మందమర్రి 30,68,750
శ్రీరాంపూర్ 57,60,547
మొత్తం 5,17,91,515
సమష్టి కృషితోనే..
సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ల సూచనలతో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ఏటా నిర్దేశిత వార్షిక లక్ష్యాలను సాధిస్తున్నాం. ఈసారి కూడా ప్రత్యేక గుర్తింపు పొందడం గర్వకారణం. నాణ్యమైన బొగ్గు వెలికితీతతోపాటు అది తరలింపు జరిపినప్పుడే లక్ష్యం సార్థకత చేకూరుతుంది. సమష్టి కృషితోనే 100 లక్షల టన్నుల బొగ్గు తరలింపు సాధ్యమైంది. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలి. కేసీహెచ్పీ అధికారులు, కార్మికులకు, యూనియన్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-రమేశ్, మణుగూరు ఏరియా జీఎం
కార్మికుల నిబద్ధత వల్లే సాధ్యం..
ఏరియా జీఎం రమేశ్ దిశానిర్దేశం మేరకు మణుగూరు ఏరియా కార్మికులు నిబద్ధత, సమష్టి కృషితో పనిచేయడం వల్లేనే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమైంది. జనవరి 19 నాటికి 100 లక్షల టన్నులకు పైగా బొగ్గు తరలించి మణుగూరు ఏరియా రికార్డు నమోదు చేసుకోవడం గర్వకారణం. సూపర్వైజర్లకు, ఉద్యోగులకు, ఇతర కార్మిక సంఘాలకు టీబీజీకేఎస్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు.
-వీ.ప్రభాకర్‌రావు, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు
అంకితభావంతో పనిచేస్తే ఫలితాలు..
అంకితభావంతో పనిచేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని తెలిపేందుకు మణుగూరు ఏరియా ఒక ఉదాహరణ. అందుకే 100 లక్షల టన్నుల బొగ్గు తరలింపు సాధ్యమైంది. కార్మిక సంఘాలకు, ఉద్యోగులకు అభినందనలు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో మరెన్నో రికార్డులు సృష్టిస్తాం. మణుగూరు ఏరియాను సింగరేణి మొత్తంలో ప్రథమ స్థానంలో నిలుపుతాం.
-లక్ష్మీపతిగౌడ్, పీకేఓసీ ప్రాజెక్ట్ మేనేజర్