
క్రీడాకారుల ఖిల్లా.. పాలమూరు జిల్లా
వివిధ క్రీడల్లో సత్తా చాటుతున్న పలువురు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
క్రికెట్లో కేక పుట్టిస్తున్నారు.. కబడ్డీలో కదం తొక్కుతున్నారు..
బ్యాడ్మింటన్‌లో రాకెట్లా దూసుకెళ్తున్నారు.. బాక్సింగ్‌లో పంచులు.. కరాటేలో కిక్‌లతో ప్రత్యర్థులపై మన క్రీడాకారులు విరుచుకు పడుతున్నారు.. ఇలా ఏ ఆటలోనైనా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
ప్రతిభ చాటుతున్నారు. అందుకే పాలమూరు జిల్లాను క్రీడాకారుల ఖిల్లాగా పేర్కొంటారు.
తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గ్రామీణ స్థాయి నుంచి పట్టణ
స్థాయి వరకు క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. నేడు జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా కథనం..
పరుగుల రాణి.. మహేశ్వరి
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామానికి చెందిన మహేశ్వరి అథ్లెటిక్స్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్నది. హైదరాబాద్ సాయి అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మహేశ్వరి పరుగుల రాణిగా పేరు సంపాదించుకున్నారు. కోచ్‌లు, పీఈటీల సహకారంతో ప్రతిభ చాటారు. 2016లో జావెలిన్ త్రోలో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత అథ్లెటిక్స్ వైపు దృష్టి మరల్చారు. 2017లో జరిగిన పోటీల్లో రజతం సాధించారు. స్టీపుల్ చేజ్‌కు మారిన మహేశ్వరి సౌత్‌జోన్ టోర్నీలో అద్భుతం సృష్టించింది. జమ్మూకశ్మీర్, కేరళ, తమిళనాడు, వైజాగ్, జార్ఖండ్, అస్సాంలో జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్, క్రాస్‌కంట్రీ పోటీల్లో సత్తా చాటింది. రెండేండ్ల కిందట ఏపీలోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ తరపున ఆడి జాతీయ జూనియర్ రికార్డు బద్దలుకొట్టింది. బాలికల విభాగంలో మహేశ్వరి మూడు వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ విభాగంలో స్వర్ణం (10ని.34.10 సెకన్లలో) నెగ్గి తన పేరిట ఉన్న జాతీయ రికార్డును మెరుగుపరుచుకున్నది. ఈ ఏడాది జూలైలో పంజాబ్ రాష్ట్రం పాటియాలలో జరిగిన 24వ నేషనల్ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2021లో పాల్గొన్నది. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలన్నదే తన లక్ష్యం అని మహేశ్వరి పేర్కొంటున్నారు.
ఆర్చరీలో రాటుదేలిన మణికంఠ..
మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రానికి చెందిన మణికంఠ ఇంటర్ చదువుతున్నాడు. నాలుగేండ్లుగా కోచ్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో స్టేడియం మైదానంలో ఆర్చరీలో శిక్షణ పొందుతున్నాడు. 2014లో ఆర్చరీని మొదలు పెట్టాడు. 2016లో మొదటి సారి రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీకి ఎంపికయ్యాడు. 2017లో మధ్యప్రదేశ్, విజయవాడలో జరిగిన జాతీయస్థాయి, 2018లో నాగ్‌పూర్, జార్ఖండ్‌లో జరిగిన జాతీయ టోర్నీలో ప్రతిభ చాటి పతకాలు సాధించాడు. ఎనిమిది సార్లు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు.
విలువిద్యలో విష్ణువర్ధన్ సత్తా..
మహబూబ్‌నగర్‌కు చెందిన ఎన్.విష్ణువర్ధన్ వరంగల్ స్పోర్ట్స్ అకాడమీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నాలుగేండ్లుగా మైదానంలో విలువిద్య సాధన చేస్తున్నాడు. వేసవి శిబిరాల్లో భాగంగా విలువిద్యలో ప్రవేశం పొంది రాష్ట్ర, జాతీయ స్థ్ధాయిలో రాణిస్తున్నాడు. 2017లో భువనగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నీలో ప్రతిభ కనబరిచాడు. తొలి ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి మణిపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్‌లలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటాడు. 11 సార్లు రాష్ట్రస్థాయి విలువిద్య టోర్నీలో ప్రతిభ చాటి పతకాలు సాధించాడు. భవిష్యత్‌లో ఒలింపిక్స్ ఆడాలన్న లక్ష్యంతో ఉన్నాడు. కోచ్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో విలువిద్యలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు.
వాలీబాల్‌లో రాణిస్తున్న గులాం..
జిల్లా కేంద్రంలోని రామయ్యబౌలికి చెందిన గులాం ఫర్హాన్‌ఖాన్ వాలీబాల్‌లో రాణిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉన్న వాలీబాల్ స్పోర్ట్స్ అకాడమీలో ఇంటర్ చ దువుతున్నాడు. ఇటీవల వాలీబాల్ ఇండియన్ కోచింగ్ క్యాంప్న కు ఎంపికయ్యాడు. దేశ వ్యాప్తంగా 220 మంది క్రీడాకారులను ఎంపిక చేసి, అందులో అత్యంత ప్రతిభ కనబరిచిన 20 మంది క్రీడాకారులను వాలీబాల్ ఇండియన్ కోచింగ్ క్యాంప్‌నకు ఎంపి క చేశారు. ఇందులో గులాం కూడా ఉన్నాడు. ఒడిశా రాష్ట్రంలో ని భువనేశ్వర్ కిట్ యూనివర్సిటీలో ఇండియన్ కోచింగ్ క్యాంప్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇరాన్ దేశంలోని తెహ్రాన్‌లో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగననున్న వాలీబాల్ అండర్-19 వరల్డ్ చాంపియన్ టోర్నీ తుది జట్టులో ఎంపిక కావాల్సి ఉండ గా, అవకాశం రాలేదు. కోచ్‌లు మెహన్కుమార్, రమాదేవి వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. భవిష్యత్‌లో భారత జట్టుకు ఆడాలన్నదే తమ లక్ష్యమని ఫర్హాన్ చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన అండర్-14 జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ, తమిళనాడులో జరిగిన అండర్-17 జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ టోర్నీతోపాటు మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో సత్తాచాటారు.