
అయిజ/ధరూరు, జనవరి 27 : కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కేఆర్ఎంబీ సభ్యుల బృందం జిల్లాలో పర్యటిస్తున్నది. కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడు రవికుమార్ పిైళ్లె, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, కేఆర్ఎంబీ ఇంజినీర్ల బృందం గురువారం జూరాల, నెట్టెంపాడ్ ప్రాజెక్టులను పరిశీలించింది. జూరాల నీటి సామర్థ్యం, పూడికతీత, నిల్వ, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో, విద్యుదుత్పత్తి తదితర అంశాలను ప్రాజెక్టుల ఇంజినీర్లతో అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఏటా జూరాల ప్రాజెక్టుకు వచ్చే నీటి నిల్వ, ఏ మేరకు నీటి వినియోగం జరుగుతుందనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం నెట్టెంపాడ్ ప్రాజెక్టుకు వెళ్లారు. ఇక్కడి నుంచి నీటిని పంపింగ్ చేయకపోయినా.. రీడింగ్ చూపిస్తున్న విషయంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు అందడంతో టెలిమెట్రీని పరిశీలించారు. రీడింగ్ తీరును తెలుసుకొని మరమ్మతులు చేయడం లేదా కొత్త టెలిమెట్రీ బిగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెట్టెంపాడ్ నుంచి నీటి వాడకం, అవసరమైన విద్యుత్, కాల్వల ఆధునీకరణ తదితర అంశాలను తెలుసుకున్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ నీటి వాటా పూర్తిగా అందకపోవడంపై కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడు రవికుమార్ పిైళ్లె శుక్రవారం సందర్శించనున్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట, ప్రధాన కాల్వ ఆధునీకరణ పనులు పరిశీలించనున్నట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. అక్కడి నుంచి కర్నూల్ జిల్లాలోని సుంకేసుల ఆనకట్టను పరిశీలించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టుల సీఈ రఘునాథరావు, ఎస్ఈలు శ్రీనివాసరావు, సత్యశీలారెడ్డి, అశోక్, డిప్యూటీ ఎస్ఈ విజయ్‌కుమార్‌రెడ్డి, ఈఈలు జుబేర్ అహ్మద్, విజయ్‌కుమార్‌రెడ్డి, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.