
కార్పొరేట్‌ను తలదన్నేలా సౌకర్యాలు.. ఇంటర్నెట్ కనెక్షన్‌తో డిజిటల్ లైబ్రరీ, ఇన్నోవేషన్ ల్యాబ్.. విద్యార్థులు సౌకర్యంగా చదువుకునేలా డ్యూయల్ డెస్క్ బెంచీలు.. ప్రాక్టికల్స్ కోసం అకాడమిక్ సైన్స్ ల్యాబ్.. తరగతి గదుల్లో గ్రీన్ బోర్డులు.. స్ఫూర్తి నింపేలా జాతీయ నాయకుల చిత్రాలు.. మెరుగైన విద్యాబోధన.. ఆంగ్ల మాధ్యమంలో 6,7 తరగతుల నిర్వహణ.. కలిసి భోజనం చేసేలా డైనింగ్ హాల్.. ఆహ్లాదకరంగా గార్డెనింగ్.. ఆర్గానిక్ కిచెన్ గార్డెన్.. విశాలమైన మైదానం.. పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు.. మొక్కలకు డ్రిప్ సౌకర్యం.. ఇవన్నీ అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలోని ఉన్నత పాఠశాల సొంతం.. ప్రభుత్వ కృషికి తోడు దాతల సహకారంతో రూ.కోటితో ఊహించని స్థాయిలో బడి రూపుదిద్దుకున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో మరిన్ని మౌలిక వసతులు ఏర్పడనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభంకానుండగా విద్యార్థులకు మరింత మేలు చేకూరనున్నది.
మహబూబ్‌నగర్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించేందుకు అప్పులు చేసి మరీ రూ.వేలల్లో ఖర్చు చేస్తూ తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాల ఈ స్థాయిలో ఉందంటే నమ్మశక్యం కాదు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ నేత పులకుర్తి తిరుమల్‌రెడ్డి సొంత నిధులతోపాటు దాతల సహకారంతో రూ.కోటి ఖర్చు చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ పాఠశాల విద్యార్థులకు ఎంతో మేలు జరుగనున్నది.
6,7వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం..
గ్రామంలో స్కూల్ అద్భుతంగా ఉన్నా.. ఇంగ్లిష్ మీడియంలో బోధన లేకపోవడంతో తమ పిల్లలను ప్రైవేటుకు పంపుతున్నట్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చెప్పారు. హెచ్ఎం తిమ్మారెడ్డి, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని తిరుమల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు సొంత ఖర్చులతో విద్యా వలంటీర్‌ను నియమించారు. ఈ ఏడాది నుంచి 6, 7 తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. దీంతో ప్రైవేటుకు వెళ్లే 20 మంది విద్యార్థులు ఇక్కడికే వస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వమే సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తుండడంతో విద్యార్థులకు వరంగా మారనున్నది.
క్రీడలకు పెద్దపీట..
తెలంగాణలో ఏ ప్రభుత్వ పాఠశాలలో లేని విధంగా రూ.12 లక్షల ఖర్చుతో అత్యాధునికంగా బాస్కెట్ బాల్ కోర్టు నిర్మించారు. వి ద్యార్థులకు ఈ ఆటపై ఆసక్తి కలిగేందుకు రాష్ట్ర స్థాయిలో పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. ఇతర క్రీడలకూ సౌకర్యాలు కల్పించారు. కబ డ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, క్రికెట్ ఆడేందుకు విశాలమైన క్రీడా మైదానం అందుబాటులో ఉన్నది. ఉపాధ్యాయులు సైతం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆటల్లో చురుకైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో దాగి ఉ న్న నైపుణ్యాలు వెలికితీసేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. నృ త్యం, కరాటే, యోగా వంటి వాటిలో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షకులకు అ య్యే ఖర్చును గ్రామ పెద్దలే భరిస్తున్నారు. పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థు లు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ఆర్గానిక్ కిచెన్ గార్డెన్..
ఎక్కడా లేని విధంగా విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం రూ.2 లక్షల ఖర్చుతో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలోనే డ్రిప్, ఫెన్సింగ్ సౌకర్యంతో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి.. కేవలం ఆర్గానిక్ పద్ధతుల్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించడం ప్రత్యేకత. వాటినే మధ్యాహ్న భోజనం వంటలకు వినియోగిస్తారు. ఉత్తనూరు పాఠశాల అభివృద్ధిని చూసి జిల్లా పరిషత్ నుంచి విద్యార్థుల డైనింగ్ హాల్ కోసం రూ.10 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. డైనింగ్ హాల్లో సామూహికంగా ఒకేసారి బేంచీలపై భోజనం చేసేలా ఏర్పాట్లు కల్పించారు.
ఉత్తమంగా.. ఉత్తనూరు పాఠశాల…
గ్రామ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచనతో తిరుమల్‌రెడ్డి తన సొంత నిధులతోపాటు బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్లతో నిధులు సేకరించారు. 2019 జూన్‌లో పనులు మొదలుపెట్టి.. 2020 డిసెంబర్ వరకు దాదాపుగా అన్నీ పూర్తి చేశారు. రూ.6 లక్షలతో డ్యూయల్ డెస్క్ బెంచీలు, రూ.12 లక్షలతో ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా ల్యాబ్ ఉపయోగపడుతున్నది. రూ.5 లక్షలతో ఇంటర్నెట్ సౌకర్యంతో డిజిటల్ స్క్రీన్ ఉండేలా లైబ్రరీ ఏర్పాటు చేశారు. తరగతులు లేని సమయంలో విద్యార్థులంతా లైబ్రరీలో పుస్తకాలు చదువుకునేలా చక్కగా తీర్చిదిద్దారు. ప్రాక్టికల్స్ కోసం అత్యాధునిక సౌకర్యాలతో రూ.3 లక్షలు ఖర్చు చేసి అకాడమిక్ సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. శుద్ధమైన తాగునీటిని అందించేందుకు రూ.3 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. రూ.5 లక్షలతో పాఠశాల చుట్టూ ఫెన్సింగ్, గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. బ్లాక్బోర్డులతో ఉపాధ్యాయులు, విద్యార్థులకు డస్ట్ సమస్య వస్తుందని రూ.50వేలతో గ్రీన్ బోర్డులు బిగించారు. రూ.1.50 లక్షలతో 10 కంప్యూటర్లు సమకూర్చారు. రూ.2 లక్షలతో పాఠశాల గోడలపై జాతీయ నాయకుల ఫొటోలు, చిత్రాలు, స్ఫూర్తిని నింపేలా ఇతర పెయింటింగ్‌లను ఏర్పాటు చేశారు. విశాలమైన గ్రౌండ్, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూత్రశాలలు నిర్మించారు. సుమారు రూ.కోటితో పాఠశాలను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దారు.
మన బడిని బాగుచేసుకుందాం..
సీఎం కేసీఆర్ ఆలోచనలు అద్భుతం. మన ఊరు-మన బ డి పేరిట సుమారు రూ.7,200 కోట్లు కేటాయించి పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్నారు. చదువుకున్న బడిని, ఊరి పాఠశాలను బాగుచేసుకునే బాధ్యత అందిరిది. ఉన్నత స్థానంలో ఉ న్న, వివిధ రంగాల్లో రాణిస్తున్న వారంతా కలిసి తాము చదివిన పాఠశాల ను బాగుచేసుకునేందుకు ముందుకు రావాలి. మా ఊరి పాఠశాలను బాగు చేసుకోవాలనే ఆలోచనతో దాతల సహకారంతో అన్ని వసతులు క ల్పించాం. ఇప్పుడు మా ఊరి పాఠశాలలో లేని సౌకర్యమంటూ ఏదీ లేదు. విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వమే ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తుండడం మాకు అదృష్టంగా మారింది.
ప్రైవేట్ వదిలి ప్రభుత్వ బడికి..
మా పాఠశాలలో 285 మంది విద్యార్థులు ఉన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో కూడా లేని విధంగా సకల సౌకర్యాలు ఉన్నాయి. మాజీ ఎంపీపీ పులకుర్తి తిరుమల్‌రెడ్డి తన సొంత నిధులతోపాటు దాతల సహకారంతో బడిని సర్వాంగ సుందరంగా మార్చేశారు. ఇక్కడ ఉన్నన్ని సౌకర్యాలు మరెక్కడా ఉండవు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మేం సొంతంగా 6, 7వ తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్‌మీడియంలో బోధిస్తున్నాం. దీంతో గతంలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే సుమారు 20 మంది విద్యార్థులు మా పాఠశాలకే వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రారంభిస్తుండడంతో విద్యార్థులకు మరింత మేలు చేకూరుతుంది. ఆంగ్ల బోధన ప్రారంభమైతే ఒక్కరు కూడా ప్రైవేటు దారి పట్టరు.