
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 15 : తెలంగాణ రాష్ట్రం వచ్చాకే అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరస్పర సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మనందరం అంకితభావంతో అభివృద్ధి చేద్దామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలా చూసుకుంటూ.. అమలులో రాజీలేకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు అభివృద్ధిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. పథకాల అమలులో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐటీ పరిశ్రమ ఐదు అంతస్తులలో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి యువతకు, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రైతుబంధు నుంచి ఈ ఏడాది వానకాలంలో 1.88 లక్షల మంది కర్షకులు రూ.221 కోట్లు అందజేశామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.1.969 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ఏడాది 3,88,992 పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేశామన్నారు. కొత్తగా 4189 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. షెడ్యూల్ కులాలు, గిరిజిన, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు లబ్ధి కల్పిస్తామన్నారు. కొవిడ్ సమయంలో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. జనరల్ దవాఖానలో 230 ఆక్సిజన్ పడకల కొవిడ్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తు కలెక్టరేట్ ప్రాంగణంలోని 10 ఎకరాల స్థలంలో రూ.300 కోట్లతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి, ఎస్పీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.