
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 14 : నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చేపట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం సత్ఫలితాలనిస్తున్నది జిల్లాల విభజనతోపాటు ఎస్పీల నియామకంతో పర్యవేక్షణ పెరిగి నేరాల కట్టడికి దోహదపడుతున్నది. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా పెంచారు. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు వాహనాలకు జీపీఎస్ సిస్టంను అమర్చారు. నిందితులను పసిగట్టేందుకు జాగిలాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. పాలమూరు పట్టణంలో రూ.కోటితో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీల ఏర్పాటుకు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పోలీసులకు పలు కేసుల పరిశోధన సులువవుతున్నది. నేరాల సంఖ్య కూ డా తగ్గిందని చెప్పొచ్చు. ఒకప్పుడు దాతల సహకారంతో అక్కడక్కడ ఏర్పాటు చేసేవారు. ఎంపీ, ఎమ్మెల్యేలు నిధులు కేటాయిస్తుండడంతో సీసీలు విరివిగా బిగిస్తున్నారు. పోలీసులు నిరంతరం నిఘా ఉంచారు. వాడవాడలా, ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇండ్లల్లో చోరీ జరిగితే నిందితులను వెంటనే గుర్తించే వీలుంటుందంటున్నారు.
గతంలో కంటే ప్రస్తుతం సీసీ కెమెరాల వినియోగం పెరిగింది. గతంలో కంటే ప్రస్తుతం సీసీల బిగింపునకు అయ్యే వ్యయం తగ్గింది. గతంలో ఒక సీసీ కెమెరాకు సుమారు రూ.45,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. అంతేకాకుండా కెమెరాలు పెద్ద సైజులో ఉండేవి. ప్రస్తుతం సైజు చిన్నగా మారడంతోపాటు ఖర్చు కూడా తగ్గింది. ప్రస్తుతం ఒక ఇంటి వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు సుమారు రూ.20,000 నుంచి రూ.30,000 అవుతున్నది.
మహబూబ్నగర్ జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఖరీదైన అత్యాధునిక టెక్నాలజీతో వైర్లెస్ సీసీ కెమెరాలు బిగిస్తున్నాం. పట్టణంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నందున సీసీల ఏర్పాటు కాస్త నెమ్మగించింది. రోడ్డు పనులు పూర్తయిన వెంటనే కూడళ్లలో, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, సమస్యాత్మక ప్రాంతాల్లో, రద్దీ ప్రదేశాల్లో, పట్టణంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో బిగింపునకు స్థానికులు, పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.