
దళిత బంధు పథకం అమలుపై ప్రగతి భవన్లో సోమవారం సన్నాహక సమావేశం జరుగనున్నది. రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు చేయనున్నారు. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నాగర్‌కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రి నిరంజన్‌రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ హాజరుకానున్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండలో దళితబంధు అమలు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలుపరుచనున్న నాలుగు మండలాల్లో పథకం అమలుకోసం సన్నాహక సమావేశాన్ని ప్రగతిభవన్‌లో సోమవారం మధ్యాహ్నం 2:30గంటలకు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నియోజకవర్గాల్లో అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారకొండ మండలం ఒకటి. సీఎం ప్రకటించిన నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌తోపాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవల సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణకు దళితబంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తొలి విడుతలో చారకొండ మండలం ఎంపికైనది. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఉదయ్‌కుమార్ హాజరుకానున్నారు. చారకొండ మండలంలో దళితబంధు అమలు ద్వారా మండలంలోని 1246 ఎస్సీ కుటుంబాలకు రూ.124.60కోట్ల లబ్ధి చేకూరనున్నది.
4,176 మంది దళిత జనాభా
2016లో ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలాల పరిధిలోని పలు గ్రామాలతో చారకొండ మండలం ఏర్పాటైంది. చారకొండ, సిర్సనగండ్ల, తిమ్మాయిపల్లి, కమ్లాపూర్, జూపల్లి, గోకారం, సేరి అప్పారెడ్డిపల్లి, మర్రిపల్లి, తుర్కపల్లి, అగ్రహారంతండా, రామచంద్రాపురం, జేపల్లి, సారంబండతండా, చంద్రాయన్పల్లి, ఎర్రవల్లి, శాంతిగూడెంతండా, గైరాన్‌తండా పంచాయతీలు ఉన్నాయి. మండలం మొత్తం జనాభా 21,051 కాగా.. 1,246 ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని 13 గ్రామాల్లో 2,049 మంది స్త్రీలు, 2,127 మంది పురుషులు ఉన్నారు. మొత్తం 4,176మంది దళితులున్నారు. మండలంలోని 1,246 కుటుంబాలకు దళితబంధు అమలు చేసేందుకు రూ.124.60 కోట్లు ఖర్చు పెట్టనున్నది.
ఆదుకోనున్న ‘దళితబంధు’
చారకొండ మండలంలోని ఎస్సీ కుటుంబాల్లో అత్యధికులు రైతులు, రైతు కూలీలు. మిగతా వారు వివిధ పనులు చేసి జీవనం సాగిస్తారు. ఉపాధి అవకాశాలు కరువై చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో చారకొండ ఒకటి. ప్రభుత్వం స్థానిక పరిస్థితులను అంచనా వేసి ఈ మండలాన్ని దళితబంధుకు ఎంపిక చేసింది. ఈ పథకం అమలుతో ఇక తమ సమస్యలు తీరుతాయని స్థానికులు భావిస్తున్నారు. దళితబంధు సాయంతో వివిధ కుటీర పరిశ్రమలు, స్వంతంగా వాహనాలు సమకూర్చుకొని ఉపాధి పొందాలని పలువురు ఆశిస్తున్నారు.
మా తలరాత మార్చే దేవుడు
మా తలరాత మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు పంపిణీ చేస్తుండు. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. గొప్ప మనసున్న సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్నాడు. నేను డిగ్రీ వరకు చదువుకున్నా.. దళితబంధు వస్తే జిరాక్స్ సెంటర్‌తోపాటు బక్సెంటర్ పెట్టుకొని జీవనోపాధి పొందుతా.