
‘జిల్లాలే టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అందరి సమన్వయంతో మరింత బలోపేతం చేస్తాను.. నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవితో సీఎం కేసీఆర్ నా బాధ్యతను మరింత పెంచారు. వచ్చే ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్
స్థానాలు గులాబీ పార్టీ ఖాతాలోకే’.. అని టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
“ నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఇతర ఏ పార్టీలకూ లేదు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతున్నది. తిరిగి ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నంతకాలం రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ కొనసాగుతది. జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో అందరి సలహాలు, సూచనల మేరకు పార్టీని మరింత బలోపేతం చేస్తాం.”
అచ్చంపేట, జనవరి 30: నాగర్‌కర్నూల్ గడ్డపై ప్రతిపక్షాల ఆటలు సాగనివ్వం. సీఎం కేసీఆర్ నాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. వారి లక్ష్యం, ఆశయాలకనుగుణంగా పార్టీ బలోపేతం కోసం నిర్విరామంగా కృషిచేస్తానని టీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. బాధ్యతలు అప్పగించి ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత బాధ్యతను పెంచారని, ప్రజలకు మరింత సేవ చేసేవిధంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ప్రజల మన్ననలు పొందేవిధంగా మరింత కలిసికట్టుగా పనిచేసి చేసి, ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తొలి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆయన మాటల్లో..
జిల్లాలో అభివృద్ధి పరుగులు
గిరిజన తండాలు, గూడెంలను గిరిజనులే పరిపాలించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. టూరిజంపరంగా జిల్లా అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ప్రభుత్వ బడుల్లో ఆంగ్లబోధన ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. టూరిజం పరంగా కొల్లాపూర్, అచ్చంపేట ప్రాంతాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. జిల్లాకు సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల మంజూరు చేశారు. అనేక గురుకులాలు నెలకొల్పారు. రహదారుల మరమ్మతులు, కొత్తగా బీటీగా ఏర్పాటు చేశారు. నూతన కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయాలు నిర్మాణం కొనసాగుతున్నది. ఇప్పటికే జిల్లా వైశాల్యంలో పెద్దది. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. శైవక్షేత్రాలు, నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతాలుగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. పల్లెలు పంటలతో కళకళలాడుతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి.
రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
వచ్చే సాధారణ ఎన్నికల నాటికి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొడతాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం, కుట్రలను ప్రజలకు వివరిస్తాం. వచ్చే ఎన్నికల్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలే ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తాయి. సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం రాష్ట్రంలో ప్రతిపక్షాలు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కొట్టుకుపోతాయి. రానున్న ఎన్నికలను మేము పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి ఫలితాలే గెలిపిస్తాయి. కేంద్రం ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. నిత్యావసర ధరలు పెంచడం, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్‌పరం చేయడం, తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కుట్రలు చేయడం, రైతులకు నష్టం కల్గించేవిధంగా చట్టాలు తీసుకురావడం, రైతు ఉద్యమాల ద్వారా చట్టాలు వెనుక్కుతీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. జిల్లాలో అందరం కలిసికట్టుగా పార్టీని, క్యాడర్‌ను పటిష్టం చేసి రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. ఎలాంటి ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్ఎస్వైపే నిలబడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు, రైతులు, పేదలు సీఎం కేసీఆర్ పాలనపై సంతోషంగా ఉన్నారు. జిల్లాలో గత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు ఇవ్వడానికి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
పథకాలపై విస్తృత ప్రచారం
ముఖ్యమంత్రి పాలనపై రాష్ట్ర ప్రజలు, రైతులు, అన్నివర్గాల ప్రజలు నేటికీ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పించన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రతినెల పింఛన్ అందించి ఆదుకుంటున్నారు. ఎక్కడ పైరవీలు, దళారుల జోక్యం లేకుండా అర్హులకు పథకాలు అందించి అన్ని వర్గాల ప్రజలకు కొండంత ధైర్యాన్ని కల్పిస్తున్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబంలో ఏదో ఒక పథకం నుంచి లబ్ధిజరుగుతున్నది. తెలంగాణలోని అన్ని పథకాలను ఇతర రాష్ర్టాలు అమలు చేస్తున్నాయి. రైతుబంధు పథకం తెలంగాణలో అమలు జరుగుతున్న తీరును చూసి ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ యోజన అందజేస్తున్నారు. మిషన్‌భగీరథ పథకం ఇతర రాష్ర్టాల్లో ఎక్కడా లేదు. దళితబంధు దేశంలోనే గొప్ప పథకం.