మంచిర్యాల టౌన్, జనవరి 13 : మంచిర్యాల పట్టణంలోని రాంనగర్లో నివాసముండే మెరుగు శ్రీనివాస్ 2013లో రెండతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. అప్పుడు భూమికి కొంత ఎత్తు వరకు మట్టిని నింపి ఇల్లు నిర్మించుకున్నాడు. రానురానూ చుట్టుపక్కల ఇండ్ల సంఖ్య పెరిగింది. రోడ్డుకోసం మట్టిని ఎత్తుగా పోయడంతో శ్రీనివాస్ ఇల్లు రోడ్డుకు నాలుగు అడుగుల కిందికి అయ్యింది. ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా గట్టేక్కాలన్న ఉద్దేశంతో యూ-ట్యూబ్‌లో భవనాల ఎత్తు పెంచే పద్ధతుల గురించి తెలుసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ట్రయాంగిల్ లిఫ్టింగ్ హౌస్ అనే సంస్థను సంప్రదించాడు. 150 చదరపు గజాల్లో తొమ్మిది ఫిల్లర్లతో నిర్మించిన తన బిల్డింగ్‌ను 6 ఫీట్ల ఎత్తుకు పెంచాలని ఆ సంస్థను కోరాడు. ఇందుకు వారు రూ. 8 లక్షలు అడుగగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత నెల 25న పనులు ప్రారంభించారు. ప్రస్తుతం 4 ఫీట్ల ఎత్తుకు లేపారు. మరో రెండు ఫీట్ల ఎత్తుకు పెంచాల్సి ఉంది. 20 రోజుల్లో పూర్తవుతాయని యజమాని శ్రీనివాస్ తెలిపాడు.
150 జాకీలు.. 70 మంది కూలీలు
ఇంటి ఎత్తు పెంచేందుకు ప్రధానంగా జాకీలను ఉపయోగిస్తున్నారు. బిల్డింగ్ ప్లింత్ భీమ్ల కింద మట్టి, ఇతర మెటీరియల్‌ను తొలగిస్తారు. అనంతరం భీమ్‌లకు కిందిభాగంలో గోడను నిర్మిస్తారు. ఇంటి గోడల కింద ఉన్న ప్లింత్భీమ్ కింద ఒక్కో అడుగు దూరంలో ఒక్కోజాకీని అమరుస్తారు. ప్లింత్ భీమ్ల కింద జాకీలను అమర్చిన అనంతరం పూర్తి ఇంటిని కూలీల సాయంతో జాకీలతో పైకి లేపుతారు. అలా ఒక అడుగు పైకి లేపాక.. ప్లింత్ భీమ్ కింద గోడను నిర్మిస్తారు. తిరిగి జాకీలతో మళ్లీ ఇళ్లు మొత్తాన్ని పైకి లేపుతారు. అలా కావాల్సినంత ఎత్తుకు పెంచుకున్నాక కత్తిరించిన ఫిల్లర్ల స్థానంలో కింది నుంచి ఫిల్లర్లను నిర్మించుకుంటూ వస్తూ పైనున్న ఫిల్లర్లతో కలుపుతారు. ఇనుపరాడ్లను వెల్డింగ్చేసి అతికిస్తారు. ఫిల్లర్ల నిర్మాణం పూర్తయ్యాక జాకీలను తొలగిస్తారు. అలా ఫిల్లర్ల మీద ఇల్లు నిలబడ్డాక కింద ఇంటి స్థలంలో తవ్విన స్థానాన్ని మట్టితో పూడ్చి ఇంటి లోపల ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు. కాగా, ఈ బిల్డింగ్ ఎత్తు పెంచేందుకు 150 జాకీలను ఉపయోగిస్తుండగా, 70 మంది కూలీలు పనులు చేపడుతున్నారు.
ఈ విధానం బాగుంది
నా రెండతస్తుల బిల్డింగ్ నాలుగు అడుగుల కిందికి ఉంది. వర్షం పడ్డప్పుడల్లా వరద ఇంటిలోకి వచ్చేది. చాలా ఇబ్బందులు పడ్డాం. ఇగ ఇల్లు మొత్తం కూల్చేసి మళ్లీ కట్టుకోవడమే మార్గమనుకున్న. ఇదే సమయంలో ఉన్న ఇల్లు ఉన్నట్లుగానే ఎత్తు పెంచుకోవచ్చని తెలుసుకున్న. చాలాసార్లు హైదరాబాద్‌కు వెళ్లి ఇండ్ల ఎత్తు పెంచే విధానం గురించి తెలుసుకున్న. పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాత ట్రయాంగిల్ లిఫ్టింగ్ హౌస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న. ప్రస్తుతం నిర్మాణం చురుకుగా సాగుతోంది. మరో 20 రోజుల్లో పని పూర్తవుతుంది. ఖర్చుకూడా తక్కువ అవుతున్నది. జాకీల ద్వారా ఎత్తును పెంచే విధానం చాలా బాగుంది.
20కి పైగా ఇండ్ల ఎత్తు..
ఇప్పటి వరకు 20కి పైగా ఇండ్ల ఎత్తును పెంచాం. మూడేళ్లుగా ఈ పని చేస్తున్న. ప్రతి చోటా సక్సెస్ అయ్యాం. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. పాతబస్తీ నుంచి చాలా మంది తమ ఇండ్ల ఎత్తు పెంచాలని మా దగ్గరికి వస్తున్నారు. ఖర్చు, సమయం ఆదా అవుతుండడంతో ఈ విధానంపై ఆసక్తి చూపుతున్నారు. ఎత్తు పెంచడం కోసం కేవలం జాకీలు, కూలీలు తప్ప వేరే ఇతర యంత్రాలను ఉపయోగించం. – పింటూ, సూపర్వైజర్