దోమలగూడ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమలగూడ జ్యోతినగర్ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి ఆటోలో వచ్చి గంజాయి విక్రయిస్తునట్లు సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తి పై నిఘా ఉంచారు.
అయితే మంగళవారం రాత్రి దోమలగూడలో చిక్కడపల్లి పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి ఆటోలో వచ్చి గంజాయి విక్రయిస్తుండగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి కొంత గంజాయిని స్వాధీనం చేసుకుని విచారించగా, అతడి పేరు రాజు అని తెలిసింది.
తనకు ధూల్‌పేట్‌కు చెందిన మహేష్ సింగ్ అనే వ్యక్తి గంజాయి ఇస్తాడని తెలపడంతో, పోలీసులు బుధవారం ఉదయం ధూల్‌పేట్‌లో ఉండే మహేష్ సింగ్ ఇంటికి వెళ్ళి ఆకస్మిక దాడులు చేయగా, కిలో గంజాయి లభించింది. దీంతో పోలీసులు రాజు, మహేష్ సింగ్ పై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.