దమ్మపేట, మే 9 : దమ్మపేటలో సర్కారు బడులు సరికొత్త రూపు సంతరించుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త సొబగులు రానున్నాయి. ఎంతోకాలంగా అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు నడుపుతూ మరోవైపు విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక విద్య నేర్చుకునేందుకు, బోధించేందుకు ఉపాధ్యాయులు సైతం నానా ఇబ్బందులు పడ్డారు. కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులను తీసుకువచ్చి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నది.
దానిలో భాగంగా మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ క్రమంలో విద్యాశాఖ ద్వారా దమ్మపేట మండలంలో మన ఊరు-మనబడి కింద ఇప్పటికే 27 పాఠశాలలను ఎంపిక చేసి వాటిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే మండలంలో రెండు ప్రాథమిక పాఠశాలలకు అభివృద్ధి నిధులు రావడంతో పాఠశాల యాజమాన్యం, అధికారులు కలిసి పనులు సైతం ప్రారంభించారు. మన ఊరు-మనబడితో సర్కారు బడులు అభివృద్ధి బాట పట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మన ఊరు-మనబడి ద్వారా మండలంలో ఎంపికైన సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసమే అభివృద్ధి నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నది. అరకొర సౌకర్యాలతో ఉన్న పాఠశాలలను గుర్తించి అన్ని సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అభివృద్ధి నిధులతో మండలంలో ఎంపికైన పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన జరిగి అభివృద్ధి బాటపట్టనున్నాయి.
మండలంలో మన ఊరు -మన బడికి ఆరు జిల్లా పరిషత్ ఉన్నత, నాలుగు ప్రభుత్వ ఉన్నత, పదిహేడు ప్రభుత్వ ప్రాథమిక మొత్తం 27 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. అందులో దమ్మపేట, పట్వారిగూడెం, మల్కారం, నాగుపల్లి, నాచారం, మందలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలు, రాచూరిపల్లి, గోపాలపురం, లింగాలపల్లి, రంగువారిగూడెం యూపీఎస్ పాఠశాలలు, జగ్గారం, పట్వారిగూడెం, పాకలగూడెం, చిన్నగొల్లగూడెం, పెద్దగొల్లగూడెం, మల్కారం, దమ్మపేట, బంజారాకాలనీ, జమేదారుబంజరు, అర్బన్ కాలనీ, కొత్తపేట, మొండివర్రె, గండుగులపల్లి, నాచారం, ముష్టిబండ, మందలపల్లి, ప్రకాష్‌నగర్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
మండలంలోని మల్కారం ప్రాథమిక పాఠశాలకు రూ.20.50 లక్షలు, దమ్మపేట అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలకు రూ.7.25 లక్షలు అభివృద్ధి నిధులు మంజూరుకావడంతో ఇప్పటికే ఆ పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఈ పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. పాఠశాల తరగతి గదుల్లో కరెంటు పైపులైను ఏర్పాటు చేసేందుకు గాడి కొట్టి పనులు చేపట్టారు. అంతేకాకుండా తాగునీరు, అదనపు గదుల మరమ్మతులు తదితర పనులను ముమ్మరంగా చేపట్టారు. అయితే కొత్తపేట, బంజారాకాలనీ, జమేదారుబంజర, దమ్మపేట ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ప్రతిపాదనలు సైతం పంపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థలకు పంపలేక సర్కారు బడులకు పంపిస్తున్నారు. తమ పిల్లలు అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా ఉంటారోనని మదన పడుతున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మనబడి కార్యక్రమం చేపట్టి పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను చూసి ఇక తమ పిల్లలకు ఎలాంటి ఢోకా లేదని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడం ఖాయమన్న భావన వారిలో ఏర్పడింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి బాట పట్టనుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం. ఈ కార్యక్రమంతో పాఠశాలలు ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా ఉండేలా విద్యాశాఖ తీసుకునే చర్యలు అమోఘం. ఏజెన్సీలో విద్యాభివృద్ధికి మార్గం మరింత సుగమమవుతోంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు.
– కీసరి లక్ష్మి, ఎంఈవో, దమ్మపేట
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులు రూపుదిద్దుకోనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నాటికి సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సకల సౌకర్యాలు అందుతాయి. మారుమూల ఉన్న గిరిజన విద్యార్థులకు సైతం సర్కారు బడిలో మెరుగైన విద్యతోపాటు అన్ని సదుపాయాలు అందనున్నాయి. భవిష్యత్‌లో ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు పడతాయని ఆశిస్తున్నా. బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– పైడి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ, దమ్మపేట