
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 1: కరోనా కారణంగా 22 రోజులుగా తాత్కాలికంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు మంగళవారం తిరిగి తెరుచుకున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలిరోజు మోస్తరుగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యాసంస్థల్లో సిబ్బంది విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి తరగతి గదుల్లోకి పంపించారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో హాజరుశాతం 43గా నమోదైంది. జిల్లా పరిధిలో మొత్తం 1,260 పాఠశాలలు ఉండగా వీటిలో 1,03,041 మంది చదువుతున్నారు. వీరిలో తొలిరోజు 44,376 మంది హాజరయ్యారు. కామేపల్లి, ఏన్కూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలను కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. డీఈవో కార్యాలయ ఏడీ వెంకటేశ్వరాచారి పండితాపురం పాఠశాలను సందర్శించారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ 301 ఉండగా తొలిరోజు 265 పాఠశాలలు మాత్రమే తెరుచుకున్నాయి. 76,178 మంది విద్యార్థులకు 27,000 మంది హాజరయ్యారు. 35.4 శాతం హాజరు నమోదైంది. విద్యార్థుల రాకతో విద్యాసంస్థలు కళకళలాడుతూ దర్శనమిచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని గురుకులాల్లో 15,120 మంది చదువుతుండగా 990 మంది హాజరయ్యారు. 9 శాతం హాజరు నమోదైంది. ఆర్సీవో ప్రత్యూష, ఏఆర్సీవో ఖుర్షీద్ పాషా ఖమ్మం డిగ్రీ కళాశాల, కూసుమంచి సోషల్ వేల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేశారు. జిల్లాలోని 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం చదువుతున్న 3,572 మందిలో 458 మంది, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 3,230 మందిలో 370 మంది తరగతులకు హాజరయ్యారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 70,445 మంది చదువుతుండగా తొలిరోజు 22,456 మంది పాఠశాలలకు హాజరయ్యారు. 26.33 శాతం హాజరు నమోదైందని డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేకమైన గదులు కేటాయిస్తున్నామన్నారు. వారికి వేరుగా పాఠాలు బోధిస్తున్నామన్నారు. విద్యార్థులందరూ మాస్క్ ధరించి తరగతులకు వచ్చేలా చూస్తున్నామని తెలిపారు. పాఠశాల ఆవరణలో శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.