మాక్లూర్, జనవరి 20: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం రాజకీయ ఎత్తుగడలో భాగమని, బురదజల్లే రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎంపీపీ మాస్త ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎంపీ అర్వింద్‌ను హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విలేకరిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే ఖండించారని, ఎంపీ అర్వింద్ దానిని ఆసరాగా చేసుకొని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే చట్టం చూస్తూ ఊరుకోదన్నారు. ధైర్యం ఉంటే నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ సర్పంచులు, నాయకుల్లో విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలనుకునే వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. దళితులకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యతిరేకమనడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గానికి రూ.192కోట్లు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే జీవన్రెడ్డిదే అన్నారు. ‘మన ఊరు మన బడి’కి సుమారు రూ.8కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ రజినీష్, సర్పంచుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌గౌడ్, రమేశ్ నాయక్, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు భూషణ్, నాయకులు పాల్గొన్నారు.