వేములవాడ టౌన్, ఏప్రిల్ 15 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం శుక్రవారం భక్తజనంతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం నుంచే స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కళాభవన్లో పెద్ద సంఖ్యలో దంపతులు కల్యాణ మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను సుమారు 40 వేల మందికి పైగా దర్శించుకున్నారని, ఆర్జితసేవల ద్వారా సుమారు రూ.22 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.