పేదల సొంతింటి కల సాకారమవుతున్నది. కరీంనగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. సకల సౌకర్యాలు, సువిశాలమైన గదులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా మొగ్దుంపూర్లో రూపుదిద్దుకున్న 40 గృహాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సోమవారం మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా అందుబాటులోకి రానుండగా, పేదల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ రూరల్, మే 15: నిరుపేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. లబ్ధిదారులపై పైసా ఖర్చు భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరించి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ఈ మేరకు జిల్లాలో శ్రీకారం చుట్టిన డబుల్ బెడ్ రూం నిర్మాణాలు పూర్తికావచ్చాయి. కాగా, కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి మొగ్దుంపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం మంత్రి గంగుల కమలాకర్ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయనుండగా, పేదల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వేగవంతమైంది. దాదాపు అన్నీ పూర్తికావచ్చాయి. అయితే మొగ్దుంపూర్లో తొలివిడత మంజూరైన 40 ఇండ్లను రూ.2.26 కోట్ల వ్యయంతో నిర్మించారు. సకల సౌకర్యాలు, సువిశాలమైన గదులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మించారు.
వీటిని చాలా రోజుల క్రితమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా నిర్మాణం కాస్త ఆలస్యమైంది. ఏది ఏమైనప్పటికీ సోమవారం లబ్ధిదారులతో గృహ ప్రవవేశాలకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం బీసీ సంక్షేమ, ఫౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి, పట్టాలు కూడా పంపిణీ చేయనుండగా, పేదల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రోజూ పనిచేస్తేగాని పూటగడువది మాకు. సొంతిల్లు కూడా లేదు. 18 ఏండ్లుగా కిరాయికి ఉంటున్నం. నా భర్త కారు డ్రైవర్గా పనిచేస్తడు. నేను కూలీ పనిచేస్త. సంపాదన అంతా ఇంటి ఖర్చులు, కిరాయికే అయితది. ఇగ ఇల్లేం కట్టుకుంటం. గుంట జాగ కొందామన్నా కొనలేని పరిస్థితి. మాసోంటోళ్ల కోసం దేవుని లెక్క కేసీఆర్ సారు ఇండ్లు ఇస్తున్నడు. చాలా సంతోషంగ ఉంది.
– వడ్లూరి లక్ష్మి, మొగ్దుంపూర్
డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సం కావడం చాలా సంతోషంగా ఉంది. మంత్రి గంగుల కమలాకర్ కృషితోనే గ్రామంలో 40 ఇండ్లను వేగంగా నిర్మించాం. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కొన్ని చిన్నా చితక పనులు మిగిలిపోయినప్పటికీ అవి కూడా పూర్తిచేస్తాం.
– జక్కం నర్సయ్య, సర్పంచ్, మొగ్దుంపూర్
పుట్టుకతోనే దివ్యాంగురాలిని. నాన్న చనిపోయి మూడేండ్లు అయితుంది. ఇన్నేండ్లు నాకు ఆసరాగా ఉన్న అమ్మ కూడా ఏడాదిన్నర కింద చనిపోయింది. అప్పటి నుంచి అన్నదమ్ముల వద్దే ఉంటున్న. కేసీఆర్ సార్, మంత్రి గంగుల కమలాకర్ దయతో నాకు ఇల్లు మంజూరైంది. ఇల్లు వస్తదని అస్సలు అనుకోలే. నేడు గృహప్రవేశం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– తాండ్ర వనిత, మొగ్దుంపూర్
మేం 20 ఏండ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నం. అమ్మ కూలీ పనిచేస్తుంది. మా అన్న కారు డ్రైవర్గా పనిచేస్తడు. నేను, తమ్ముడు చదువుకుంటున్నం. మా నాన్న అనారోగ్యంతో చనిపోయిండు. అప్పటి నుంచి అమ్మ, అన్న పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నరు. రోజూ పనిచేస్తేనే పూటగడుస్తది. ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు ఎలా కట్టుకుంటం. ఇక సొంతింటి కల సాధ్యం కాదని అనుకుంటున్న టైంలో సర్కారు మాకు డబుల్ బెడ్ రూం ఇచ్చింది. అమ్మ దేవేంద్ర పేరుమీద ఇల్లు మంజూరైంది. ఈరోజు కొత్త ఇంట్లోకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
– వడ్లూరి అశోక్, మొగ్దుంపూర్
మాది పేద కుటుంబం. నా భర్త డ్రైవర్గా పనిచేస్తడు. నేను కూలీ పనిచేస్త. మాకు ఇద్దరు పిల్లలు. మేం ఇద్దరం కష్టపడితేనే ఇల్లు గడుస్తది. ఏదో ఉన్నంతల కుటుంబాన్ని నెట్టుకొస్తూ, పిల్లలను మంచిగా చదివిస్తున్నం. మాకు సొంతిల్లు లేదు. గుంట జాగ కూడా లేదు. గత ప్రభుత్వాలను వేడుకున్నా ఫలితం లేదు. ఇక మా పరిస్థితి ఇంతే అనుకుంటున్న టైంలో దేవుని లెక్క కేసీఆర్ సార్, మంత్రి గంగుల కమలాకర్ సార్ ఇల్లు మంజూరు చేసిన్రు. చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం రుణపడి ఉంటా.
– కందుల భాగ్యలక్ష్మి, మొగ్దుంపూర్