రామడుగు, మే 8 : ప్రపంచ సాగునీటి రంగంలోనే గాయత్రీ పంప్‌హౌస్ నిర్మాణం మన ఇంజినీర్ల అద్భుత సృష్టి అని జిల్లా అదన పు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంపుహౌస్‌ను ఆదివారం తన స్నేహితురాలైన ఐఆర్ఎస్తో కలిసి గరిమ అగర్వాల్ సందర్శించారు. ముందుగా అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని మ్యాపుల ద్వారా ప్రాజెక్టు డీఈఈ రాంప్రదీప్ అదనపు కలెక్టర్‌కు వివరించారు. అక్కడి నుంచి డెలివరీ సిస్టర్న్ పంపులు నీటిని విడుదల చేయడాన్ని పరిశీలించారు.
వాహనాల్లో సొరంగ మార్గం ద్వారా భూగర్భంలో నిర్మించిన సర్జ్ఫూల్ను సందర్శించారు. ధర్మారం మండలం నందిమేడారం రిజర్వాయర్ వద్ద గేట్లను ఎత్తడం ద్వారా గాయత్రీ పంపుహౌస్ సర్జ్ఫూల్లోకి నీరు చేరుతుందని అధికారులు వారికి వివరించారు. అనంతరం సర్వీస్ బే విభాగానికి చేరుకొని అక్కడి నుంచి బాహుబలి మోటార్లను చూశారు. ఒక్కో మోటర్ 3,150 కూసెక్కుల నీటిని సుమారు 115 మీటర్ల ఎత్తులో పంపింగ్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపా రు.
గాయత్రి పంప్‌హౌస్‌లో మొత్తం ఏడు పంపులను ఏర్పాటు చేశారన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మానవ నిర్మితమైన అద్భుతాల్లో గాయత్రి పంపుహౌస్ ఒక్కటన్నారు. ఇలాంటి ప్రాజెక్టు చూడడం సంతోషంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీరింగ్ అధికారుల కృషి మరువలేనిదన్నారు. ఇక్కడ ప్రాజెక్టు డీఈఈ రాంప్రదీప్, లక్ష్మీపూర్ సర్పంచ్ చిలుముల రజిత, కార్యదర్శి త్రిదండ పాణి శ్రీనివాస్, ఉప సర్పంచు నరేందర్ రెడ్డి, వీడీసీ చైర్మన్ ప్రభాకర్, తదితరులు ఉన్నారు.