హుజూరాబాద్, ఏప్రిల్ 28: గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామానికో కేంద్రం ఏర్పాటు చేయగా, రైతులకు దళారుల బెడద తప్పింది. శ్రమకు తగ్గ ఫలితమూ దక్కుతుండడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. మండలంలో వానకాలంలో మొత్తం 2,60,387 క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుత సీజన్లో దాదాపు అదేస్థాయిలో ధాన్యం కేంద్రాలకు రానున్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేసింది. మండలంలో 22,857 ఎకరాల్లో వరి పంట సాగైంది.
వరి కోతలు ముమ్మరం కావడంతో గ్రామాల్లో ఎటూచూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. అన్ని మండలాల్లో వరి కోతలు జోరందుకోగా, ఇప్పటి వరకు 30శాతం వరకు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. రెక్కల కష్టం చేతికి వస్తుండడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు.
ధాన్యం విక్రయాలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం గతంలో మాదిరిగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. హుజూరాబాద్ మండలంలో హుజూరాబాద్, జూపాక, తుమ్మనపల్లి పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్, రంగాపూర్, రాంపూర్, సిర్సపల్లి, పెద్దపాపయ్యపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రారంభమైంది. జూపాక పీఏసీఎస్ ఆధ్వర్యంలో బొత్తలపల్లి, కనుకులగిద్ద, శాలపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుమ్మనపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో తుమ్మనపల్లి, సింగాపూర్, బోర్నపల్లి, మాందాడిపల్లిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇప్పలనర్సింగాపూర్, ధర్మరాజుపల్లి, దమ్మక్కపేట, కందుగుల, చిన్నపాపయ్యపల్లి, ఇందిరానగర్, జూపాక, కాట్రపల్లిలో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో చెల్పూర్, పోతిరెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
ధాన్యం విక్రయంలో రైతులకు దళారుల బెడద తప్పింది. ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే వ్యాపారులు, మిల్లర్లు అగ్గువసగ్గువకు అడిగేటోళ్లు. ధాన్యం విక్రయించిన వారం పది రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతాయి. గన్నీ సంచుల కొరత లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
– ఎడవెల్లి కొండల్‌రెడ్డి, హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్