శంకరపట్నం, ఏప్రిల్ 28: బాకీ చెల్లించాలని అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటి ఎదుట ఈరెల్లి సంపత్ చేపట్టిన దీక్ష విషాదంతమైంది. 13 రోజులుగా నిరాహార దీక్ష చేసిన ఆయన బుధవారం రాత్రి అనారోగ్యం, మానసిక వేదనతో మరణించాడు. శంకరపట్నం మండలం మెట్పల్లిలో జరిగిన ఘటనతో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఈరెల్లి సంపత్ (35), శనిగరపు సతీశ్ స్నేహితులు. మూడేండ్ల క్రితం సతీశ్‌కు సంపత్ రూ.19 లక్షలు అప్పు ఇచ్చాడు.
ఈ క్రమంలో సంపత్‌కు చెల్లించాల్సిన బాకీ డబ్బుల కింద రూ.12 లక్షలకు బదులు 4 గుంటల భూమిని పెద్ద మనుషుల సమక్షంలో సతీశ్ రాసిచ్చాడు. మిగతా రూ.7 లక్షలు తర్వాత చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. ఇటీవల పలుమార్లు సంపత్ తాను అనారోగ్యం పాలయ్యాయని చికిత్స కోసం తాను ఇచ్చిన బాకీ తీర్చాలని సతీశ్‌ను అడగ్గా మాటమార్చాడు. తాను ఎలాంటి బాకీలేనని చెప్పాడు. దీంతో సంపత్ ఈ నెల 16న సతీశ్ ఇంటి ఎదుట దీక్ష చేపట్టాడు. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంపత్ ఒంట్లో సత్తువలేకపోవడంతో పడుకొనే దీక్ష కొనసాగించాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పరిస్థితి విషమించి మరణించాడు.
అయితే అంతకుకొద్దిసేపటి కిందే సతీశ్ ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిపోయాడు. సంపత్ మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అతని కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని సతీశ్ ఇంటి ఎదుట ఖననం చేసేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు సర్ధిచెప్పి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హుజూరాబాద్ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య ఈరెల్లి లలిత ఫిర్యాదు మేరకు సతీశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు.