రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల దినదినాభివృద్ధి చెందుతున్నది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి గట్టెక్కింది. పట్టణానికి ఇరువైపుల బైపాస్‌రోడ్లు, విశాలమైన అంతర్గత రహదారులు, డివైడ ర్లు, అందమైన సర్కిళ్లతో కొత్తశోభను సంతరించుకున్నది. నలుదిక్కులా నిర్మించిన పార్కులు, ఎవె న్యూ ప్లాంటేషన్‌తో ఆహ్లాదం పంచుతున్నది. మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకుంటున్న కొత్తచెరువు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నది.
సిరిసిల్ల మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంతో కార్మిక్షేత్రానికి మణిహారం కానున్నది. ఎదురెక్కి వచ్చిన కాళేశ్వర జలాలతో మండుటెండల్లో మధ్య మానేరు జలకళతో ఉట్టిపడుతున్నది. రామప్ప గుట్టల మధ్యన గోదావరి అందాలను వీక్షించేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. విరివిగా చేపల ఉత్పత్తితో మత్స్యకారులకు దండిగా ఉపాధి లభిస్తున్నది. రామప్ప గుట్ట నుంచి బ్రిడ్జి వరకు నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కరకట్ట వాకర్లకు వాకింగ్ ట్రాక్‌గా మారింది. మానేరు తీరం సండే వీకెండ్ స్పాట్‌గా రూపుదిద్దుకున్నది. వాగు ఒడ్డున నిర్మించిన బతుకమ్మ ఘాట్ సందర్శకుల తాకిడితో కిటకిట లాడుతున్నది. జిల్లా ప్రజలకు సముద్రపు బీచ్‌ను తలపించే విధంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందు కోసం రూ. ఎన్నికోట్లయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందు కోసం మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. బ్రిడ్డి నుండి సాయిబాబా ఆలయం వరకు 3 కిలోమీటర్ల దూరం కరకట్ట నిర్మాణానికి రూ. 30కోట్ల నిధులు మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయి..
మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దిన వరంగల్ భద్రకాళీ చెరువు తరహాలో సిరిసిల్ల మానేరు వాగు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధ్యతలను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)కి అప్పగించింది. మున్సిపల్, ఇరిగేషన్ శాఖల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నది. మూడు కిలోమీటర్ల కరకట్ట పొడవునా ప్రజలకు అహ్లాదాన్ని పంచేవిధంగా బ్రిడ్డి, బతుకమ్మ ఘాట్, నెహ్రూనగర్, అంబాభవానీ, సాయిబాబా ఆలయాల వద్ద పార్కులు నిర్మించనున్నారు. ఇప్పటికే సర్కారు విడుదల చేసిన రూ. 30కోట్లతో వాగు బ్రిడ్జి నుంచి మూడు కిలోమీటర్ల మేర 60 ఫీట్ల వెడల్పుతో కరకట్ట నిర్మాణ పనులు చేపట్టారు. అలాగే పార్కులు, ఫౌంటేన్లు, బతుకమ్మ ఘాట్ వద్ద విశాలమైన పార్కు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. కట్టపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, యోగా చేసుకునేందుకు వీలుగా ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు.
వరంగల్ భద్రకాళీ చెరువును తలపించేలా సిరిసిల్ల మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కి చర్యలు తీసుకుంటున్నం. మంత్రి కేటీఆర్ చొరవతో పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నం. ప్రస్తుతం కరకట్ట పనులు వేగంగా జరుగుతున్నయి. ప్రభుత్వ స్థలం లేనందున వాగులోనే కరకట్టను నిర్మిస్తున్నం. కుడా పర్యవేక్షణలో మున్సిపల్, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తాం.
-అమరేందర్‌రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి