ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
ఐదుగురిని రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్‌రతన్ కుమార్
గద్వాలన్యూటౌన్, అక్టోబర్ 4: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్లలో చోటుచేసుకున్నది. జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ వివరాలు వెల్లడించారు. మక్తల్ మండలం భగవాన్‌పల్లికి చెందిన మాధవికి 11ఏండ్ల కిందట వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన చుక్క రాజు(25)తో వివాహమైనది. వీరిద్దరికి ముగ్గురు సంతానం. అయితే వారు రెండేండ్ల నుంచి గద్వాల మండలంతుర్కోనిపల్లి గ్రామ శివారులోని అలూరు రాములుకు చెందిన బత్తాయితోటలో పనికి వచ్చి స్ధిరపడ్డారు. అయితే మాధవికి భగవాన్‌పల్లికి చెందిన బోయ మునేశ్ అలియాస్ కలవాల్దొడ్డి మునేశ్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం రాజుకు తెలిసి పలుమార్లు మందలించాడు. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. మూడు నెలల కిందట భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మళ్లీ ప్రియుడు మునేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. నెల రోజుల కిందట రాజు మాధవిని కాపురానికి తీసుకొచ్చాడు. అతడితో కాపురానికి ఇష్టం లేని మాధవి వివాహేత సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని, ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ప్రియుడు మునేశ్‌తో సహ కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్రతో కలిసి పథకం వేసింది. హత్యకు సహకరించినందుకు ముగ్గురితో రూ.10వేల చొప్పున ఇస్తామని మాధవి ప్రియుడు మునేశ్ ఒప్పందం కుదుర్చున్నారు. ఈ నెల 1వ తేదీన రాజుకు అన్నంలో నిద్ర మాత్రలను పౌడర్ చేసి కలిపిపెట్టింది. రాజు నిద్రలోకి జారుకోవడంతో ప్రియుడు మునేశ్కు ఫోన్ చేసింది. అదే రాత్రి తుర్కోనిపల్లి శివారులో బత్తాయితోటలో నిద్రమత్తులో ఉన్న రాజును అందరు కలిసి మెడకు తాడు బిగించి హతమార్చారు. ఆనంతరం హత్యను ప్రమాదవశాత్తుగా కరెంట్‌షాక్ కొట్టి మరణించినట్లుగా చిత్రీకరించేందుకు తోట సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దిమ్మెపై పడేశారు. ఆ రోజు రాత్రి మునేశ్ మాధవితో గడిపి ఉదయం మృతుడి సెల్‌ఫోన్ తీసుకొని వెళ్లాడు. ఉదయం తోటలో పనికి వచ్చిన రామాంజీ అనే వ్యక్తితో తన భర్త రాత్రి నుంచి కనబడటం లేదని, వెళ్లి చూసి రమ్మని చెప్పింది. ఈ క్రమంలో రాజు మృతదేహం ట్రాన్స్ఫార్మర్ దిమ్మెపై ఉన్నట్లుగా గుర్తించాడు. రామాంజీ మాధవిని అనుమానాస్పదంగా చూసి తోట యజమానికి ఫోన్ చేయగా ఏడ్చినట్లు నటిస్తూ అక్కడినుంచి పరారైందన్నారు. ఈ నెల 2వ తేదీన మృతుడు రాజు సోదరుడు చుక్క నరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో హత్య చేసినట్లు అంగీకరించడంతో మాధవి, మునేశ్, కుంటి జైపాల్, రవి, రవీంద్రను రిమాండ్‌కు తరలించినట్లు ఏస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి ఉరితాడు, బైక్, నాలుగు సెల్ఫోన్లతోపాటు మృతుడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు అందిన తక్కువ సమయంలో కేసు మిస్టరీని ఛేదించిన డీఎస్పీ రంగస్వామి, గద్వాల సీఐ షేక్ మహబూబ్ బాషా, ఎస్సై గాయత్రీ, సిబ్బంది సమరసింహారెడ్డి, అశోక్, రాజశేఖర్, రాజేందర్, రమేశ్‌ను ఎస్పీ ఆభినందించారు. సమావేశంలో గద్వాల సీఐ షేక్ మహబూబ్‌బాషా, రూరల్ ఎస్సై గాయత్రీ, సిబ్బంది తదితరులు ఉన్నారు.