
పాలకవీడు, జనవరి 22 : ఈ నెల 27 నుంచి 29 వరకు జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆర్డీఓ వెంకారెడ్డి తెలిపారు. ఉత్సవాలపై ఆయా శాఖల అధికారులతో జాన్పహాడ్ దర్గా గ్రామంలోని జేపీఎస్ ఫంక్షన్హాల్లో ఆర్డీఓ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు కోదాడ, మిర్యాలగూడ నుంచి 30కి పైగా బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ మిర్యాలగూడ డిపో మేనేజర్ పాల్, కోదాడ డిపో అసిస్టెంట్ మేనేజర్ లావణ్య తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా డిపోల నుంచి ప్రతి పది నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసి సిబ్బంది మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మండల వైద్యాధికారి నాగయ్య తెలిపారు. ఉత్సవాలకు 300 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని డీఎస్పీ రఘు వెల్లడించారు. దక్కన్, పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీల సహకారంతో భక్తులకు రక్షిత తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఆర్డబ్లుఎస్ అధికారులు చెప్పారు. రహదారుల మరమ్మతులను ఆదివారం నుంచే చేపట్టనున్నట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. భక్తులకు పార్కింగ్ సదుపాయం, విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ఆటంకాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఫైర్ ఇంజిన్ను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
మాస్క్లు, శానిటైజర్ల పంపిణీకి దాతల చేయూత
ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు జాన్పహాడ్ గ్రామానికి చెందిన జేపీఎస్ మెడికల్ దుకాణం వారు 5 వేల మాస్క్లు, ఓజో ఫౌండేషన్ వారు 10 వేల మాస్క్లు, శానిటైజర్లు అందించేందుకు ముందుకు వచ్చారు. దాతలు ముందుకు రావడం హర్షణీయమని ఆర్డీఓ పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ రఘు, ఎంపీపీ భూక్యాగోపాల్, ఎంపీడీఓ జానయ్య, జడ్పీటీసీ మాలోతు బుజ్జి, పీఏసీఎస్ ఛైర్మన్ యరెడ్ల సత్యనాయణరెడ్డి, సర్పంచ్ రూపావత్గోరి, సీఐ నర్సింహారెడ్డి, దర్గా ఇన్స్పెక్టర్ మహమూద్, ఎస్ఐ సైదులు గౌడ్, ఆర్ఐ జానీ పాల్గొన్నారు.