ఖైరతాబాద్ : వైద్య రంగంలో భారత్ స్వయంసంవృద్ధి సాధించి ప్రపంచలోనే ప్రత్యేక స్థానం సంతరించుకున్నదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా 65 వార్షికోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం కళాశాల క్యాంపస్‌లో జరిగాయి. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై వర్చువల్ వేదికగా ప్రసంగించారు.
కొవిడ్ 19 శతాబ్దపు అత్యంత ఘోరమైన సంక్షోభమని అభివర్ణించారు. అన్ని రంగాలను ఈ మహామ్మారి ప్రభావితం చేసిందన్నారు. దానిని సమర్థవంతంగా ఎదుర్కొవడంలో భారతీయ వైద్య రంగం విజయం సాధించిందన్నారు. వ్యాక్సినేషన్లోనూ 126 కోట్ల డోసులు విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు.
రెండో దశను త్వరగా అధిగమించి దేశం గొప్ప పునరాగమనాన్ని సాధించి ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచిందన్నారు. గతంలో పీపీఈ కిట్లను దిగుమతి చేసుకునే వారమని, నేడు వాటిని ఎగుమతి చేయడంలో రెండో స్థానంలో ఉన్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో వైద్య రంగంలో స్వయంసంవృద్ధి సాధించామన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ యోజనలో భాగంగా ఐదేండ్లలో రూ.64,180 కోట్లతో జాతీయ ఆరోగ్య మౌళిక సదుపాయాల పథకాన్ని ప్రారంభించారన్నారు. వచ్చే ఏడాది నాటికి భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగం విలువ 372 బిలియన్ యూఎస్ డాలర్లకు పెరుగుతుందన్నారు.
వైద్య వస్తువుల ఎగుమతిలో దేశం 12వ స్థానంలో ఉందని, 200లకు పైగా దేశాలకు మందులను ఎగుమతి చేస్తున్నామన్నారు. మెడికల్ టూరిజంలో భారత్ ప్రపంచంలోని టాప్ 5లో స్థానం దక్కించుకుందన్నారు.