హవేళీఘనపూర్, ఏప్రిల్ 1 : మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండల పరిధిలోని అతి పురాతనమైన కూచాద్రి వేంకటేశ్వర స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతోంది. దక్షిణ భారతదేశంలోనే అరుదుగా కనిపించే దేవాలయాల్లో కూచాద్రి వేంకటేశ్వరాలయం గొప్పదని పురాణాలు చెబుతున్నాయి. దేవాలయాన్ని దర్శించుకునేందుకు తెలంగా ణతో పాటు మహరాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ నిర్వాహకులు వసతులను ఏర్పాటు చేశారు. ఏటా ఉగాది పర్వదినం రోజున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు జాతరను నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉగాది రోజున బండ్ల ఊరేగింపు, అనంతరం రథోత్సవం కార్యక్రమం ఉం టుందని పూజారి నవీన్ తెలిపారు.
దక్షిణ భారతదేశంలో అరుదుగా కనిపించే దేవాలయాల్లో కూచాద్రి వేంకటేశ్వరాలయం ఒకటిగా పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే రెండు శిలల మధ్యలో స్వామివారు వెలియడం అరుదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి తిరుమలలో ఏడుకొండల వేంకటేశ్వరుడికంటే ముందే ఇక్కడ స్వామివారు వెలసినట్లు చరిత్ర చెబుతోంది. పొర్లుదండాలు పెట్టుకుంటూ స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. వైష్ణవ దేవాలయాల్లో ఎక్కడ కూడా శివమందిరాలు ఉండవు. కానీ, ఇక్కడ మాత్రం శివ కేశవులు దర్శనమిస్తారు. ఈ దేవాలయానికి క్షేత్ర పాలకులుగా పంచ బేతాళుడు కాపలాగా ఉన్నారు. ఒకరు ఆలయ ధ్వజస్తంభం ముందు, మరొకరు గుడి మండపంలో ఉన్నారు. గ్రామానికి మూడు వైపుల కాల భైరవుడు, బేతాళస్వామి దేవాలయానికి క్షేత్ర పాలకులుగా వెలిశారు.
ఏటా ఉగాది రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఎత్తైన గుట్టపై వెలసిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. రెండు సంవత్సరాలుగా కరోనా దృష్ట్యా జాతర నిర్వహించకపోవడంతో ఈ ఏడాది జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నదని ఆలయ నిర్వాహకులు అన్నారు.