దళితుల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం యావత్ దేశానికే ఆదర్శం. త్వరలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వందమంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు అందజేస్తాం. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కృషిచేయాలి. మార్చి7వ తేదీలోగా యూనిట్ల గ్రౌండింగ్ పనులను పూర్తిచేయాలి.
నిజామాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు పథకం యావత్ దేశానికి ఆదర్శమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, అసెంబ్లీ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు అందివ్వనున్నట్లు చెప్పారు. నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని, వారే క్రియాశీల పాత్ర వహిస్తారని స్పష్టం చేశారు. రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తున్నదని, జ్వర సర్వేను పకడ్బందీ చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని యంత్రాంగాన్ని మంత్రి అప్రమత్తం చేశారు. జ్వర సర్వేలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఔషధ కిట్లు ఇవ్వాలని సూచించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్లలో వేర్వేరుగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో మంత్రి వేముల సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్‌లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజుతో సమీక్ష నిర్వహించారు. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో సుదీర్ఘంగా చర్చించారు.
పకడ్బందీగా అమలుచేయాలి
దళితబంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ఆదర్శవంతంగా నిలుపాలని అధికారులను కోరారు. అట్టడుగు వర్గాలకు చేయూతను అందించి వారు ఆర్థిక పరిపుష్టి సాధించే విధంగా పాటుపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఇప్పటికే హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వంద మంది చొప్పున లబ్ధిదారులకు దళితబంధును అమలు చేయాలని సంకల్పించామన్నారు. ఇందుకు అనుగుణంగా యూనిట్ల స్థాపన కోసం సమగ్ర ప్రణాళికతో వారం రోజుల్లో నివేదిక సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని మంత్రి అప్రమత్తం చేశారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దళితబంధు అమలయ్యేలా చూడాలన్నారు. యూనిట్ విలువ రూ.10లక్షలు ఉండాలనే నిబంధన ఏదీ లేదని, అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన యూనిట్లను గుర్తిస్తే లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి పథకాన్ని వర్తింపజేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా వ్యవహరిస్తారని మంత్రి స్పష్టం చేశారు.
కట్టడి చేద్దాం…
ఒమిక్రాన్ వ్యాప్తితో కొవిడ్ -19 కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు అనవసర భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, గుంపులుగా తిరుగకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కు లు ధరించాలన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్‌లో ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వహించిందని ప్రశంసించారు. ముఖ్యంగా పోలీసు, వైద్యారోగ్య, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే స్ఫూర్తితో ఇంటింటి సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేయాలని సూచించారు. ఇంటింటి ఆరోగ్య సర్వే ఎంత పక్కాగా జరిగితే అంతే చక్కటి ఫలితాలను సాధించవచ్చన్నారు. సర్వేలో పోలీస్ శాఖ తరపున కానిస్టేబుళ్లు కూడా భాగస్వాములను చేయాలని సీపీకి సూచించారు.
లక్షణాలున్న వారికి ఆరోగ్య కిట్లు…
జ్వరంతోపాటు దగ్గు, జలుబు, తలనొప్పి, ఒంటినొప్పులు వంటి లక్షణాలు సైతం ఎంత మందికి ఉన్నాయన్నది నిర్ధారించాలని అన్నారు. పై అన్ని లక్షణాలు ఉన్న వారికి హోం ఐసొలేషన్ మెడికిల్ కిట్లను అందజేయాలన్నారు. మందులు వాడినప్పటికీ ఇంకనూ అవే లక్షణాలతో బాధపడుతున్న వారిని సమీప దవాఖానలో చేర్పించి మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి? ఎంత మంది పేషెంట్లకు అవి సరిపోతాయన్నది ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో తొలి రోజు దాదాపు లక్ష ఇండ్లలో సర్వే చేస్తే 1900 మందికి జ్వరం, జలుబు వంటి లక్షణాలు గుర్తించారని చెప్పారు. అంటే ఈ లెక్కన సుమారు ఆరు వేల మందిలో జ్వరం తదితర లక్షణాలు బయట పడే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నామన్నారు. కొవిడ్ టీకాలను అర్హులైన వారందరూ తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవిడ్ సోకినా అంతగా ఇబ్బందులు ఎదురవ్వడం లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు.
మార్చి 7లోపు యూనిట్ల టార్గెట్, గ్రౌండింగ్ పనులు పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 22: మార్చి 7వ తేదీలోగా దళితబంధు యూనిట్ల టార్గెట్, గ్రౌండింగ్ పనులు పూర్తిచేయాలని అధికారులకు మంత్రి వేముల సూచించారు.కామారెడ్డి జిల్లా సమీకృత భవనంలో శనివారం సాయంత్రం దళితబంధుపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఆయా శాఖల వారీగా యూనిట్ల ఏర్పాటు జాబితాను వారం రోజుల్లోగా సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేయాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోని నిజాంసాగర్ మండలాన్ని దళితబంధు పథకానికి ఎంపి క చేసి అమలుచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 350 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. ఉపాధి అవకాశాలు, వనరులను బట్టి యూనిట్ల ఎంపికను సత్వరమే పూర్తి చేయాలన్నారు. రూ.5లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సైతం యూనిట్లను గుర్తిస్తే గ్రూపుల వారీగా కేటాయించవచ్చని వివరించారు. కామారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో లక్షా 21 వేలు, కలెక్టర్ వద్ద 30వేల హోం ఐసొలేషన్ కిట్లను అందుబాటులో ఉంచినట్లు మంత్రి వేముల తెలిపారు. జిల్లాలో 2.10 లక్షల కుటుంబాలు ఉండగా రెండు రోజుల్లో లక్షా 16వేల ఇండ్లల్లో ఫీవర్ సర్వే పూర్తయ్యిందన్నారు. మొత్తం 2,714 మందికి లక్షణాలు ఉన్నట్లు సర్వే టీంలు గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లు అందించాయని తెలిపారు.