ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంటింటా జ్వర సర్వే శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు కార్యక్రమం విజయవంతమైంది. వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్, పంచాయతీ సిబ్బంది బృందాలుగా ఏర్పడి, ఇంటింటికెళ్లి సర్వే చేశాయి. ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు టీకా వేసుకోని వారుంటే, వారికి అక్కడే ఉన్న టీకా కేంద్రంలో వ్యాక్సిన్ చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సర్వే తీరును అధికారులు పర్యవేక్షించారు. మొదటి రోజూ మెదక్ జిల్లాలో 633 బృందాలు 37,711 ఇండ్లలో సర్వే చేసి 2,443 మందికి కరోనా కిట్లు ఇచ్చారు. సిద్దిపేటలో 837 బృందాలు.. 32178 ఇండ్లలో పరీక్షలు నిర్వహించాయి. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4127 ఇండ్లలో పరీక్షలు చేసి, 598మందికి కొవిడ్ కిట్లు పంపిణీ చేశారు. కాగా, ఏడు రోజుల్లో సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, మూడు రోజుల్లో పూర్తి చేయాలని సిద్దిపేట అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన వాటిని యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్వే అనంతరం రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనున్నారు.
ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్న సమయంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రం ప్రభుత్వం ఇంటింటా ఆరోగ్యం అనే నినాదంతో ఇంటింటా సర్వేను ప్రారంభించింది. కరోనా రెండో వేవ్‌లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహించగా, మంచి ఫలితాలు సాధించింది. గతంలో నిర్వహించిన సర్వేకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అంతే కాకుండా కరోనా వైరస్ ఉధృతి నివారించేందుకు చాలా ఉపయోగపడింది. దాని స్ఫూర్తిగా మరోమారు ఇంటింటా జ్వర సర్వేను శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చేపట్టారు.
మెదక్, జనవరి 21 : కరోనా థర్డ్‌వేవ్ విజృంభిస్తున్న వేళ చిన్నపాటి లక్షణం కనిపించినా ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు కరోనా జ్వరమేదో? సాధారణ జ్వరమేదో? తేల్చి, ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టేందుకు రాష్ట్ర ప్ర భుత్వం జ్వర సర్వేను చేపడుతున్నది. ఇందులో భా గంగా మెదక్ జిల్లాలో శుక్రవారం నుంచి సర్వేకు జి ల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మెదక్ కలెక్ట ర్ హరీశ్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేశారు. గతేడాది రెండో దశ కరోనా వ్యాప్తి సమయంలో ఈ జ్వర సర్వేను చేపట్టారు.
మెదక్ జిల్లాలో 532 బృందాలు
ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు జిల్లాలోని 21 మండలాల్లోని 20 పీహెచ్‌సీల పరిధిలో 633 టీంలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఒక టీం 40-50 ఇండ్లను సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ టీంలో ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్త, మున్సిపాలిటీ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. వీరు ప్రతిరోజూ గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. అయితే పట్టణం, గ్రామాల్లో వైద్య సిబ్బంది జ్వర సర్వే నిర్వహిస్తున్నది. ఇంట్లో సభ్యుల వివరాలు తెలుసుకుంటున్నారు. వారిలో ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు, ఆయసం ఇతర కరోనా లక్షణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడుగుతున్నారు. ఈ క్రమంలో సాధారణ లక్షణాలు ఉంటే, వారికి వెంటనే కరోనా కిట్లు ఇస్తున్నారు.
ఏడు రోజుల్లో సర్వే పూర్తి..
జ్వర సర్వేను జిల్లాలో ఏడు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో లక్షా 72వేల కుటుంబాలున్నాయి. ప్రతి రోజూ ఒక్కో టీం 40 నుంచి 50 ఇండ్లు జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. ఒక్కో ఇంటి వద్ద ఐదు నిమిషాలు సమయం తీసుకొని, కుటుంబ ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లు అందిస్తున్నారు. జిల్లాలో 40వేల కిట్లు అందుబాటులో ఉన్నాయని, మందుల కొరత కూడా లేదని వైద్యాధికారులు తెలిపారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సర్వే అనంతరం రిపోర్టును అందజేయనున్నారు.
మొదటి రోజు 37,711 ఇండ్లు సర్వే..
మెదక్ జిల్లాలో శుక్రవారం 37,711 ఇండ్లలో 633 టీంలు సర్వే చేసింది. 2,443 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. 2,443 మందికి కరోనా కిట్లను అందజేశారు.
ఉమ్మడి జిల్లాలో జ్వర సర్వే ప్రారంభం
తొలి రోజూ కార్యక్రమం విజయవంతం
సర్వే తీరును పర్యవేక్షించిన అధికారులు
ఇంటింటికీ వెళ్లిన వైద్య బృందం
ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు..
మొదటి రోజూ మెదక్‌లో 37,711 ఇండ్లు.. 633 బృందాలు
సిద్దిపేటలో 837 బృందాలు.. 32178ఇండ్లు
సంగారెడ్డి మున్సిపాలిటీలో 4127 ఇండ్లలో పరీక్షలు.. 598 కొవిడ్ కిట్ల పంపిణీ
పకడ్బందీగా నిర్వహిస్తాం..
మెదక్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తాం. జిల్లాలో లక్షా 72వేల కుటుంబాలున్నాయి. జిల్లాలోని 21 మండలాల్లోని 20 పీహెచ్‌సీల పరిధిలో 633 టీంలను ఏర్పాటు చేశాం. ప్రతి రోజూ ఒక్కో టీం 40-50 ఇండ్లను సర్వే చేయాలని చెప్పాం. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఐసొలేషన్ కిట్లు అందిస్తున్నాం.