
గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పాటు డీపీఆర్‌కు ఆమోదముద్ర వేశారు. దీంతో గజ్జలమ్మ గట్టు వద్దే ఈ లిఫ్ట్ కార్యరూపం దాల్చనున్నది. రూ.581 కోట్ల అంచనాతో నిర్మాణం చేయనున్నారు. 1.32 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. 950 ఎకరాలు భూసేకరణ చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని 33 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఇందుకు సంబంధించి గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీ కానున్నది.
గట్టు, జనవరి 12 : ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చనున్నది. ప్రతిపక్షాల నోర్లకు మూత పడనున్నది. మండలం దిగువ ప్రాంతంలో ఉన్న మూడు రిజర్వాయర్లతో కొంత భాగమే పచ్చబడిందనే అపవాదు తొలగనున్నది. గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు డీపీఆర్‌కు ఆమోదముద్ర పడడంతో గట్టు, కేటీదొడ్డి మండల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. 1.32 టీఎంసీల సామర్థాన్ని ఖరారు చేశారు. రిజర్వాయర్‌తోపాటు కాలువల నిర్మాణం కోసం సుమారుగా 950 ఎకరాల భూమి సేకరించనున్నారు. రూ.581 కోట్ల నిధులు కావాలని అధికారులు అంచనా రూపొందించారు. కాగా, గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీ కానున్నది. ఇదిలాఉండగా ఎత్తిపోతలకు ప్రతిపాదించిన ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూమే ఉండడంతో భూసేకరణకు ఇబ్బందులు తప్పనున్నాయి. రిజర్వాయర్‌కు సంబంధించి కొంత విస్తీర్ణంలోనే రైతుల నుంచి భూసేకరణ చేపట్టనున్నారు. సుమారు 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనున్నది. చెరువులు, కుంటలను నింపడంతో మరో మూడు వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
‘గట్టు’స్వరూపం..
ర్యాలంపాడు రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి 2.8 కిలోమీటర్ల వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని పంప్‌హౌస్‌కు తరలిస్తారు. పంప్‌హౌస్ వద్ద ఏర్పాటుచేయనున్న 12 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు మోటార్లతో మూడు కి.మీల దూరంలో ఉన్న గట్టు ఎత్తిపోతల రిజర్వాయర్‌కు పైప్‌లైన్ ద్వారా నీటిని తోడిపోస్తారు. ఈ రిజర్వాయర్‌కు నిత్యం 810 క్యూసెక్కుల చొప్పున 50 రోజలపాటు నీటిని తోడేలా డిజైన్ చేశారు. కుడి, ఎడమ కాలువలను నిర్మించనున్నారు.
33 వేల ఎకరాలకు సాగునీరు
గట్టు ఎత్తిపోతలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 1.32 టీఎంసీల సామర్థ్యంతో 33 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా రిజర్వాయర్‌ను డిజైన్ చేశారు. గురువారం టెండర్ నోటిఫికేషన్ రానున్నది. ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం.
చాలా ఆనందంగా ఉన్నది.
గట్టు ఎత్తిపోతలకు ఓ రూపం వస్తుండడంతో చాలా ఆనందంగా ఉన్నది. కరువు నేలగా ఉన్న గట్టు, కేటీదొడ్డి మండలాలు పచ్చదనంగా మారుతుండడం శుభపరిణామం. ఎత్తిపోతల పనులను వేగవంతంగా పూర్తిచేయాలి.