నేరేడుచర్ల, ఏప్రిల్ 2 : రోడ్డు ప్రమాదం పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నింపింది. నేరేడుచర్లకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు షేక్ గౌస్ కుటుంబ సభ్యులతో కలిసి కడపలోని దర్గాకు వెళ్లి వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో చోటు చేసుకున్నది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నేరేడుచర్లకు చెందిన షేక్. గౌస్ కడప జిల్లా కేంద్రంలోని హజ్రత్ అమీన్ పీర్ దర్గాను సందర్శించేందుకు గతనెల 31న భార్య ఫర్హత్, కొడుకు ఇంతియాజ్‌తో కలిసి కారులో వెళ్లారు. మార్గమధ్యంలో కొండ మల్లేపల్లిలో ఉంటున్న తన సోదరి సాజిదాతో పాటు మేనల్లుడు రోషన్ జమీల్‌ను కూడా కారులో తీసుకెళ్లాడు. శుక్రవారం దర్గాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అదేరోజు రాత్రి తిరిగి నేరేడుచర్లకు బయల్దేరారు. శనివారం తెల్లవారుజామున కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం తుర్కలపల్లి గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న సిమెంట్ దిమ్మెను అతివేగంగా ఢీకొట్టింది. దాంతో షేక్. గౌస్(45), భార్య ఫర్హత్(40), సోదరి సాజిదా బేగం(55) మేనల్లుడు సయ్యద్ రోషన్ జమీల్ (25) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు ఇంతియాజ్కూ కూడా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారును రోషన్ నడుపుతున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
షేక్ గౌస్ 2009 నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. గౌస్ పట్టణంలోని హుజూర్నగర్ బస్టాప్ వద్ద ప్లాస్టిక్ సామాన్ల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 9వ తరగతి చదువుతున్న కూతురును బంధువుల ఇంట్లో ఉంచి భార్య, కొడుకుతో కలిసి దర్గాను దర్శించుకునేందుకు వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా.. కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కొండమల్లేపల్లి : నాగర్‌కర్నూల్ జిల్లా తుర్కలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రానికి చెందిన తల్లీ, కుమారుడు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన సయ్యద్ సుల్తాన్, సాజిదా దంపతులు 25 ఏండ్లుగా కొండమల్లేపల్లిలో నివాసముంటున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సుల్తాన్ స్థానిక సాగర్ రోడ్డులో బ్యాటరీల మరమ్మతులు చేస్తుండగా.. కుమారుడు రోషన్ జమీల్ సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్నాడు. సాజిదా, ఆమె కుమారుడు రోషన్ జమీల్ కడపలో ఉన్న దర్గాకు తమ్ముడి కుటుంబంతో కలిసి కారులో వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత షేక్. గౌస్ మృతికి హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. గౌస్ దంపతుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుమారుడు ఇంతియాజ్, కూతురు హుస్నార్కు అండగా ఉంటానని పేర్కొన్నారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.