
గతంలో ఆ పల్లె అనేక సమస్యలతో సతమతమైంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం నేడు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో సత్తుపల్లి మండలంలోని గంగారం గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామ పంచాయతీలో సౌకర్యాలు మెరుగయ్యాయి.
-సత్తుపల్లి రూరల్, జనవరి 12
గంగారం పంచాయతీ పరిధిలో 4,600 మంది నివసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామ పంచాయతీ అభివృద్ధి పరుగులు పెడుతున్నది. గ్రామపంచాయతీకి ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తుండడంతో గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. గ్రామంలో అంతర్గత రహదారులు, బీటీ, సీసీ రోడ్లతో సుందరంగా కనిపిస్తున్నది. పల్లె ప్రకృతివనం నిర్మాణంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరగడం తో హరితవనాన్ని తలపిస్తున్నది. గ్రామంలో ఊరి శివారులో చెరువు పక్కన నిర్మించిన వైకుంఠ ధామంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. వైకుంఠధామంలో శివుడి విగ్రహం, కాటికాపరి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. గ్రామంలోని రహదారుల పక్కన వేసిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతూ ఆహ్లాదకరంగా మారాయి.
రూ.22 లక్షలతో రైతు వేదిక
రూ.22 లక్షలతో రైతు వేదిక భవనం నిర్మించారు. రూ.12 లక్షలతో వైకుంఠధామం నిర్మించి సకల సౌకర్యాలు కల్పించారు. మరో రూ.2.50 లక్షలతో వర్మీకంపోస్టు ఎరువుగా తయారు చేసేలా తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు డంపింగ్యార్డు నిర్మించారు. రూ.4లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి పాత ఆర్అండ్ బీ భవన సముదాయం వద్ద పల్లెప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో గ్రామస్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.
నిధుల వరద
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో గ్రామంలో రూ.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.15 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం, రూ.15 లక్షలతో కల్వర్టు, రూ.4 లక్షలతో గ్రావెల్రోడ్లు నిర్మించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. హరితహారంలో భాగంగా గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారం వారం శానిటైజేషన్, బ్లీచింగ్ చల్లిస్తున్నారు. దీంతో గ్రామంలో స్వచ్ఛత పరిఢవిల్లుతున్నది. గ్రామంలో తడి, పొడిచెత్తను వేరు చేసేందుకు ఇంటింటికీ చెత్తబుట్టలను పంపిణీ చేశారు. సిమెంటు డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు.
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే గ్రామంలో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డు నిర్మించాం. అంతర్గత రహదారులను సీసీ, బీటీ రోడ్లుగా మార్చాం. ప్రతి వారం పారిశుధ్య చర్యలు చేపడుతున్నాం. గ్రామంలో నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. ప్రభుత్వం ద్వారా పంచాయతీకి వచ్చే నిధులతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమ పథకాలను ప్రజల దరికి చేర్చుతున్నాం.
పల్లెప్రకృతి వనం అద్భుతం
గంగారం గ్రామంలో పల్లె ప్రకృతివనం అద్భుతంగా ఉంది. సువిశాలమైన ప్రాంగణంలో రకరకాల పూల, పండ్ల మొక్కలతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. గంగారం స్వాగత బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయం. వైకుంఠధామం, డంపింగ్ యార్డు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రహదారి పక్కనే పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు, పర్యాటకులు సేదతీరుతున్నారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్, పాలకవర్గానికి అభినందనలు.